Andhra Pradesh: పల్నాడులో అప్రకటిత కర్ఫ్యూ
ABN , Publish Date - Jun 02 , 2024 | 06:04 AM
ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.
నరసరావుపేట, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అన్ని పట్టణాల్లో దుకాణాలను మూయించారు. దీంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
నరసరావుపేటలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకులు జరుపుకోవాల్సి ఉండగా, దానిని నిలిపివేయించి ఇంట్లో జరుపుకోవాలని పోలీసు శాఖ ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బాలాజీ లత్కర్, ఎస్పీ మాలికాగార్గ్ కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దుకాణాలను మూయిచడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తమ పొట్ట కోడుతున్నారని కార్మికులు, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై పల్నాడు జిల్లాలో పోలీసులు 161 కేసులు నమోదు చేసి, దాదాపు 1200 మందిని అరెస్టు చేశారు. 382 మందిపై రౌడీషీట్లు తెరిచారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా అల్లర్లుకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్నారు.