Share News

Indoor stadium : అలంకారప్రాయం.. ఇండోర్‌ స్టేడియం

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:09 PM

పట్టణ అభివృ ద్ధిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇందులో పట్టణ క్రీడా కారులు ఆహ్లాదకరంగా ఆడుతూ ఆటల్లో పటిమను పెంచుకునేవారు. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పోటీలు సైతం నిర్వహించలేని దుస్థి తిలో కొట్టుమిట్టాడుతోంది.

Indoor stadium : అలంకారప్రాయం.. ఇండోర్‌ స్టేడియం
మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఐదేళ్లుగా ఏర్పాటు కాని కమిటీ

పోటీలు నిర్వహించలేని దుస్థితి

అధికారుల తీరుతో ఇబ్బంది

ఆధునికీకరణకు నోచుకోని స్టేడియం

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 21: పట్టణ అభివృ ద్ధిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇందులో పట్టణ క్రీడా కారులు ఆహ్లాదకరంగా ఆడుతూ ఆటల్లో పటిమను పెంచుకునేవారు. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పోటీలు సైతం నిర్వహించలేని దుస్థి తిలో కొట్టుమిట్టాడుతోంది. మున్సిపల్‌ ఇండోర్‌స్టేడియం తర్వాత పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఇండోర్‌ స్టేడియాలు క్రీడాకారులతో సందడిగా ఉంటే మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో క్రీడాకారులు లేకపోవడం, మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.

క్రేజీ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ ఒకటి. బ్యాడ్మింటన్‌ పట్ల యువతను ప్రోత్సహించడానికి అనిబీసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలు మైదానంలో బ్యాడ్మింటన్‌ ఇండోర్‌స్టేడియం ఏర్పాటు చేశారు. 2012లోనే రూ.67 లక్షల మున్సిపల్‌ నిధులతో ఇండోర్‌ స్టేడియం ఏర్పా టు చేశారు. తర్వాత స్టేడియంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరో రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు.


3pdtr18.gifపాతబడిన సింథటిక్‌ కోర్టు

ఇందులో సభ్యత్వానికి నెలకు రూ. 300 చెల్లించాల్సి ఉంది. మొదట్లో స్టేడియంలో 60 మంది సభ్యులు చేరారు. అయితే సగం మంది డబ్బు చెల్లించిన దాఖలాలు లేవు. అయితే స్టేడియంలో ఉదయం పూట సభ్యులు ఆడుకుంటే సాయంత్రం క్రీడాకారులు ఆడుకునే అవకాశం కల్పించారు. మొదట్లో నిర్వహణ బాగా సాగడంతో క్రీడాకారులు ఆడుకోవడానికి వచ్చేవారు. అంతేకాకుండా బయటి నుంచి వచ్చే క్రీడా కారులతో పోటీలు నిర్వహించేవారు. తర్వాత మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడుతూ రాసాగింది. కరోనా నుంచి బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లగా స్టేడియం నిర్వహణకు కనీసం కమిటీని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. సభ్యుల ఫీజు రాకపోయినా మున్సిపాలిటీ మాత్రం నెల నెలా కరెం టు బిల్లు, బాయిస్‌ వేతనం, క్లీనింగ్‌ కోసం ఖర్చు చేస్తోంది.

కొరవడిన పర్యవేక్షణ

ఇండోర్‌ స్టేడియాన్ని తీర్చిదిద్ద డంలో అధికారులు వెనుకంజ వేశారని చెప్పవచ్చు. సభ్యులను చేర్చుకున్న వారు తర్వాత కాలం లో సభ్యుల చేరికపై దృష్టిసారించ లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఉన్న సభ్యుల నుంచి నెల నెలా ఫీజును వసూలు చేయలేకపోయా రు.


4pdtr18.gifరంగులు వెలసిన గోడలు

ఫలితంగా స్టేడియంలో అత్యం త ఖరీదుతో చేపట్టిన ఉడెన్‌ ఫ్లోర్‌ దెబ్బతినింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్‌ స్టేడియం తర్వాత పట్టణంలో ఏర్పాటైన ప్రైవేటు స్టేడియాలు క్రీడాకారులతో సందడి జరుగుతున్నాయి. మరో విశేషమేమిటంటే చాలా మంది మున్సి పల్‌ సిబ్బంది సైతం ప్రైవేటు స్టేడియాల్లో సభ్యులు గా చేరారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో క్రీడాకారులు లేకపోవడం, మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.

అనుమతి లేకుండా శిక్షణ

క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలంటే మున్సిపాలిటీ అనుమతి అవసరం. ప్రస్తుతం స్టేడియంలో అనుమతి లేకుండానే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెలకు సూమారు రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టేడియం నుంచి తగిన ఆదాయం రాకపోవడంతో మున్సిపల్‌ అధికారులు కూడా స్టేడియం నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాదాపు పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన సింథటిక్‌ మ్యాట్‌పైనే ఆడుకుంటున్నారు. మ్యాట్ల పక్కన ఉన్న ఉడెన్‌ఫ్లోర్‌ దెబ్బతిన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో క్రీడాకారులు సర్దుకు పోతున్నారు. ఎప్పుడో వేసిన రంగులు వెలిసినా పట్టించుకోవడంలేదు. స్టేడియాన్ని ఆధునికీకరించాలన్న ధ్యాస కూడా అధికారులకు లేకుండాపోయింది.


అధికారుల ఆదేశాలను పట్టించుకోని వైనం

మున్సిపల్‌ పాఠశాల వ్యాయామ ఉపాధాయుడిని అధికారులు ఇండోర్‌ స్టేడియంలో కోచ్‌గా నియమించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులందరినీ విద్యాశాఖ పరిధిలోకి తేవడంతో కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు మున్సిపల్‌ అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని సమాచారం. ఆ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులు డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అధికారులు స్టేడియంను ఆధునికీకరించి శిక్షణ ఇవ్వాలని, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

స్టేడియం కమిటీ ఏర్పాటుకు చర్యలు

ఇండోర్‌ స్టేడియం కమిటీ ఏర్పాటుకు మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకుంటున్నారు. తాను కోచ్‌గా వచ్చిన తర్వాత పైకప్పు కారకుండా రిపేర్లు చేయించా. స్టేడియం సభ్యులు కొందరు నెల నెలా డబ్బులు చెల్లించలేదు. చాలా కాలం నుంచి బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించడంలేదు. క్రీడాకారులు షటిల్‌ బ్యాట్‌ ప్రాక్టీసు చేసుకోవడానికి మిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపితే కొందరు అధికారులు అడ్డుకున్నారు. కోచింగ్‌కు కొద్దిమంది క్రీడాకారులే వస్తున్నారు.

రాఘవ, బ్యాడ్మింటన్‌ కోచ్‌

Updated Date - Sep 21 , 2024 | 11:09 PM