Purandeswari: వరద అనంతర చర్యలు కూడా వేగంగా జరగడం గొప్ప విషయం
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:38 PM
వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వస్త్రాలను పురందేశ్వరి అందచేశారు.
విజయవాడ: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వస్త్రాలను పురందేశ్వరి అందచేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత పది రోజులుగా విజయవాడలో ఎక్కువ భాగం ముంపులోనే ఉందన్నారు. ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పురందేశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటూ.. పర్యవేక్షణ చేస్తూ తీసుకున్న చర్యలు ఆదర్శనీయమని పురందేశ్వరి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు తీసుకుని పని చేసిన చంద్రబాబుకి బీజేపీ పక్షాన అభినందనలు చెబుతున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించి వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని పురందేశ్వరి తెలిపారు. వరద అనంతర చర్యలు కూడా వేగంగా జరగడం గొప్ప విషయమన్నారు. వేలాది మంది పారిశుద్ద్య కార్మికులను రంగంలోకి దించి.. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారని కొనియాడారు. ఈ విపత్తులో కీలక పాత్ర పోషించిన కొంతమంది పారిశుద్ద్య కార్మికులను బీజేపీ పక్షాన సన్మానించి.. ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఈ వరదల నుంచి ప్రజలను గట్టెక్కెంచేందుకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు అందరూ బాగా పని చేశారన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో పురందేశ్వరి సమావేశం అయ్యారు.
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానమని పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోదీ అమలు చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసిందన్నారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20 వేల కోట్లు డీపీఆర్ ఓకే చేశారన్నారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారన్నారు. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకు లేఖ రాశారని.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని పురందేశ్వరి పేర్కొన్నారు.