డీఎస్సీ ఆలస్యం!
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:38 AM
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్
తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్
ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం.. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం
న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తు
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డీఎస్సీ నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈలోగా డీఎస్సీకి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఆ లోగా భర్తీ!: ప్రభుత్వం సానుకూల ఉద్దేశంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసినా.. అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ మొత్తం ప్రక్రియ పూర్తిచేసింది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు ఎంత సమయం పడుతుందనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు నెలలు, ఆరు నెలలు అంటూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అందుకు అనుగుణంగా ఆర్‌వోఆర్‌లో మార్పులు చేసుకుని వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ వర్గీకరణకు ఆరు నెలల సమయం తీసుకుంటే దాదాపు కొత్త విద్యా సంవత్సరం చేరువ అవుతుంది. అప్పుడు డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈలోగానే ప్రక్రియ పూర్తవుతుందని, ఎలాగైనా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ పూర్తవుతుందని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది.
మరింత పకడ్బందీగా
సాధారణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై న్యాయ వివాదాలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించడానికి పాఠశాల విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా షెడ్యూళ్లు మారిపోతూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయ వివాదాల అంశాలను సుదీర్ఘంగా సమీక్షించారు. వివాదం తలెత్తకుండా నోటిఫికేషన్‌ను సాఫీగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వర్గీకరణ కారణంగా మరికొంత గడువు దొరకడంతో నోటిఫికేషన్‌ను మరింత పకడ్బందీగా, ఎక్కడా చిన్న లోపాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా దీనిని సీరియ్‌సగా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టిన హామీ కావడంతో న్యాయ వివాదాలను అధిగమించేలా నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు.