Vundavalli Sridevi: కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్..
ABN , Publish Date - Aug 01 , 2024 | 01:46 PM
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు.
అమరావతి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారన్నారు. సామాజిక న్యాయం పాటించే పేటెంట్ హక్కు టీడీపీదేనని మరోసారి స్పష్టమైందని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్ అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.
మాదిగలను కేవలం తన ఓటు బ్యాంకుగానే జగన్ చూశారు తప్ప ఏనాడూ వర్గీకరణపై మాట్లాడలేదని పేర్కొన్నారు. వర్గీకరణ కోసం దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న మాదిగలకు సుప్రీం తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. దళితులంతా ఐక్యతతో ముందుకు సాగాలని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం గెలిచిందని తెలిపారు. మా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.