Share News

YS Jagan: శరణు... శరణు!

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:35 AM

అధికారం కోల్పోయి... అనుకున్నవేవీ జరగక... దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది.

YS Jagan: శరణు... శరణు!

  • ఢిల్లీ అండ కోసం జగన్‌ పాట్లు

  • స్పీకర్‌ ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు బీజేపీ అడగ్గానే అంగీకరించిన జగన్‌

  • కేంద్ర సర్కారుకు బయటి నుంచి మద్దతు!

  • లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం

  • అంశాల వారీగా కాదు... ‘అన్నింటికీ’ జై

  • పాత కేసులకు తోడు... కొత్త స్కాములు

  • ఐదేళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు

  • చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం

  • తననూ అరెస్టు చేస్తారని జగన్‌ ఆందోళన!?

అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయి... అనుకున్నవేవీ జరగక... దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీయే సర్కారుకు పదేళ్లుగా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాజాగా... ప్రభుత్వానికి బయటి నుంచి తమ మద్దతు ఉంటుందని ‘బేషరతు’గా వెల్లడించినట్లు తెలిసింది. రెండు రోజుల కిందట దీనిపై కేంద్రానికి లిఖితపూర్వకంగానే సమాచారం పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టయి... దాదాపు పదేళ్లుగా బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో... ఏపీలో విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పూర్తిస్థాయి సఖ్యత ప్రదర్శిస్తున్నారు. పైకి ‘అంశాల వారీగా మద్దతు’ అని చెబుతూనే... బీజేపీ అడగకముందే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనపై కేసులు పాతవే అయినప్పటికీ... పరిస్థితులు పూర్తిగా కొత్తవి! రాష్ట్రంలో జగన్‌ అధికారం కోల్పోయారు. వైసీపీ స్థాయిని ప్రజలు 11 అసెంబ్లీ స్థానాలకు కుదించారు. 4 లోక్‌సభ స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడమే కాకుండా... కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు అత్యంత కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరిగింది. ఇవన్నీ జగన్‌ ఊహించని, అస్సలు కోరుకోని పరిణామాలు. తాను సీఎంగా ఉండగా... చంద్రబాబును స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఇరికించి, అరెస్టు చేసి... 53 రోజులు జైలులో పెట్టారు. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర వరకు అనేకమంది టీడీపీ నేతలను రకరకాల కేసుల్లో అరెస్టు చేయించారు. ‘‘నేను ఇంత చేసినప్పుడు.. నన్ను ఏమీ చేయకుండా ఉంటారా?’’ అనే భయం జగన్‌కు పట్టుకున్నట్లుంది.

పైగా... జగన్‌ హయాంలో జరిగిన మద్యం, ఇసుక, గనుల కుంభకోణాల లెక్కలను కొత్త ప్రభుత్వం బయటికి లాగుతోంది. ఈ కేసుల్లో జగన్‌ను పూర్తి ఆధారాలతో అరెస్టు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అటు సీబీఐ కేసులకు ఇటు రాష్ట్ర పోలీసులు పెట్టే కేసులు తోడైతే మరోమారు కారాగారవాసం తప్పదని జగన్‌ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలన్నా, కేసుల నుంచి ఉపశమనం లభించాలన్నా కేంద్ర పెద్దల ‘అండ’ ఉండాల్సిందే అని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే... తనకు ఉన్న నలుగురు ఎంపీలతో కేంద్రానికి బయటి నుంచి, బేషరతుగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... బుధవారం జరిగే లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు జగన్‌ మద్దతు ప్రకటించేశారు.

Updated Date - Jun 26 , 2024 | 07:09 AM