Share News

YS Jagan: ఢిల్లీలో జగన్‌కు దారుణ అవమానం..

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:52 AM

ఢిల్లీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారుణ అవమానం జరిగింది. ఏపీలో హింస చెలరేగుతుందంటూ ఢిల్లీలో.. జగన్ మొక్కుబడి ధర్నా చేసి మమ అనిపించారు.

YS Jagan: ఢిల్లీలో జగన్‌కు దారుణ అవమానం..

ఢిల్లీ: ఢిల్లీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారుణ అవమానం జరిగింది. ఏపీలో హింస చెలరేగుతుందంటూ ఢిల్లీలో.. జగన్ మొక్కుబడి ధర్నా చేసి మమ అనిపించారు. ఆ తరువాత ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అంతా నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక.. ఎవరినీ కలవకుండా జగన్ విజయవాడ బాట పట్టారు. పోనీ దీక్షలో ఏమైనా సాధించారా? అంటే అది కూడా లేదు. కనీసం జాతీయ పార్టీ నేతల మద్దతును కూడా కూడగట్టలేకపోయారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం యత్నించి నిరాశ చెందారు. అంతకు ముందు జగన్ మాట్లాడుతూ.. మోదీ సహా అందరి అపాయింట్‌మెంట్‌లు అడిగామని.. రెండు రోజులు ఢిల్లీ లోనే ఉండి కలుస్తానని జగన్ చెప్పారు.


రెండు రోజులు వేచి చూసినా కూడా ఏ ఒక్కరి అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో జగన్ నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి ఐదేళ్ల పాటు ఏపీలో జగన్ అరాచక పాలన కొనసాగించారు. ఇప్పుడు కనీసం ఆరు వారాలు తిరగకముందే ‘ఏపీలో హింసాకాండ’ అంటూ ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగారు. ఆరు వారాలకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలట. నవ్విపోదురుగాక.. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని.. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందంటూ ఢిల్లీలో జగన్ నానా రచ్చ చేశారు. బీభత్సమైన జన సందోహం నడుమ ధర్నా చేయాలని వెళ్లారు. తీరా అక్కడి సీన్ చూస్తే తిప్పి కొడితే 200 మంది కూడా లేరు. ఇక ఆ 200 మందిలోనూ.. సగం మంది పోలీసులు, మీడియా ప్రతినిధులే కావడం గమనార్హం.


అది చూసిన జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. నిర్వాహకులపై మండి పడ్డారు. పైగా అక్కడి సీన్ చూసి వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులే అవాక్కయ్యారట. ఇక అంతటితో జగన్‌కు తలనొప్పి తగ్గిందా? అంటే ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా... మైకు సరిగా పనిచేయలేదు. దీంతో ఆయనకు కోపం బీభత్సంగా వచ్చి ఉంటుంది. ఇక ఆ తర్వాత... మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు సైతం పార్టీ నేతలకు మింగుడు పడలేదు. ‘ఎవరూ స్టేజీ మీదికి రావొద్దు’ అని అంబటి చెప్పడంతో కీలక నాయకులూ కొంత అసహనంతో దూరంగా వెళ్లిపోయారు. ఇక జగన్‌ కలుగజేసుకుని పరిస్థితిని సరి చేశారు. వేదికపై వసతులు, ఏర్పాట్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమమంతా సమన్వయం లేకుండా సాగిందంటూ పార్టీ నేతలు సైతం పెదవి విరిచిన పరిస్థితి.

ఇవి కూడా చదవండి..

Polavaram project : పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Amritpal Singh: దేశంలో ప్రతి రోజు అప్రకటిత ఎమర్జెన్సీ.. ఎంపీని నిర్బంధిస్తారా..?

Google Maps: ఫ్లై ఓవర్‌ ఎక్కండి!

Read More AP News and Latest Telugu News

Updated Date - Jul 26 , 2024 | 10:14 AM