Share News

CM Chandrababu: గత ప్రభుత్వ కేటాయింపులపై కీలక నిర్ణయం..?

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:03 AM

రాష్ట్ర వనరులను ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తన వారికి అడ్డగోలుగా రాసిచ్చేశారు. కీలకమైన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుల పేరిట ప్రధాన జలాశయాలు.. లక్షల ఎకరాల భూములను దోచిపెట్టారు.

 CM Chandrababu: గత ప్రభుత్వ కేటాయింపులపై కీలక నిర్ణయం..?
CM Chandrababu Naidu

అస్మదీయులకు హైడల్‌ ప్రాజెక్టులు సహా వేల ఎకరాల కేటాయింపు

కేంద్ర సర్కారు నిబంధనలు బేఖాతరు

రైతులను వేధించి భూములు స్వాధీనం

అప్పట్లో తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

ఇప్పుడు వీటిని తిరిగి వెనక్కి తీసుకుంటారా?

విద్యుత్తు సమీక్షలో సీఎం నిర్ణయంపై ఉత్కంఠ


అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వనరులను ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తన వారికి అడ్డగోలుగా రాసిచ్చేశారు. కీలకమైన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుల పేరిట ప్రధాన జలాశయాలు.. లక్షల ఎకరాల భూములను దోచిపెట్టారు. రిజర్వాయర్లు, వాటికి ఆనుకుని ఉన్న విలువైన భూములను కూడా తన అస్మదీయులకు అప్పగించేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. బహిరంగ వేలం విధానంలో కాకుండా.. పెట్టుబడుల ఆకర్షణ పేరిట సహజ వనరులన్నింటినీ అస్మదీయులకు జగన్‌ కట్టబెట్టడంతో సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తాయి. తన అనుయాయులకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడంపై ఎన్ని విమర్శలు.. ఆరోపణలు వచ్చినా జగన్‌ వెనక్కు తగ్గలేదు. మీడియాకు సైతం ఏనాడూ వివరణ ఇవ్వలేదు.


ఒంటెద్దు పోకడలతో..

2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులను గెలుచుకున్న తనను ప్రశ్నించేదెవరు? అన్నట్లుగా జగన్‌ వ్యవహరించారు. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజాధనంతో నిర్మించిన రిజర్వాయర్లు, విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను తన వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నారు. తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకపోయినా.. బుల్‌డోజ్‌ చేసుకుంటూ జగన్‌ ముందుకే వెళ్లారు. ప్రకృతి సంపదైన నదులు, అడవులను సొంతవారికి జగన్‌ కట్టబెట్డడాన్ని ప్రతిపక్షనేతగా అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా నిరసించారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ హయాంలో దోచిపెట్టిన వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటారా? నాడు జరిగిన తప్పులను నేడు సరిదిద్దుతారా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంటారా? జగన్‌ తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు చేపట్టే విద్యుత్తు సమీక్షలో జగన్‌ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

Updated Date - Jun 24 , 2024 | 07:39 AM