Share News

Yogi Vemana University: వేమన వర్సిటీని భ్రష్టు పట్టించిన జగన్‌ బామ్మర్ది

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:54 AM

మాజీ సీఎం జగన్‌ బావమరిది సురేంద్రనాఽథరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని భ్రష్ఠు పట్టించారని ఏఐవైఎఫ్‌ నేతలు ఆరోపించారు.

Yogi Vemana University: వేమన వర్సిటీని భ్రష్టు పట్టించిన జగన్‌ బామ్మర్ది

  • సురేంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి

  • టీడీపీ కార్యాలయంలో ఏఐవైఎఫ్‌ ఫిర్యాదు

  • పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు

  • వైసీపీ నేతపై చర్య తీసుకోవాలన్న అనంత వాసి

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ బావమరిది సురేంద్రనాఽథరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని భ్రష్ఠు పట్టించారని ఏఐవైఎఫ్‌ నేతలు ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ని కలిసి ఫిర్యాదు చేశారు. ‘యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గా ఉన్న సురేంద్రనాఽథ రెడ్డి వైసీపీ హయాంలో మొత్తం యూనివర్సిటీని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వైసీపీకి అనుకూలమైన వ్యక్తులను యూనివర్సిటీలో పెట్టుకొని అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, రోజువారీ వేతనాల ఉద్యోగాలు, ఇతర బోధనేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ పాటించలేదు.

ఆయన అక్రమాలపై విచారణ జరపాలి. యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలి’’ అని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.గంగాసురేశ్‌ నాయకత్వంలో వచ్చిన బృందం విజ్ఞప్తి చేసింది. దీనిపై విచారణ జరిపిస్తామని మంత్రి రాం ప్రసాదరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు వారికి హామీ ఇచ్చారు. గతంలో వైసీపీతో అంటకాగి ఆ పార్టీకి పోస్టల్‌ ఓట్లు వేయించిన అధికారులను....చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనపై రాళ్లు వేయించిన వారిని దగ్గరకు తీయడం వల్ల ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ ఇబ్బంది పడుతోందని, దీనిపై పరిశీలన జరపాలని ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన కొందరు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.


అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగంట గ్రామానికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ జయరాంరెడ్డి పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు చేయించుకొన్నారని, తాగునీరు సరఫరా చేయకుండానే చేసినట్లుగా బిల్లులు పెట్టి డబ్బు తీసుకొన్నారని ఆ గ్రామానికి చెందిన ఎన్‌. శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. తమ భూమిపై ఎమ్మార్వో తప్పుడు నివేదిక పంపడంతోపాటు సర్వే నంబర్‌ మార్చి మోసం చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా వి.కోట మండ లం మద్దిరాళ్ల గ్రామానికి చెందిన నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయిస్తానని మధ్యవర్తి చెప్పడంతో రూ.40 వేలు ఇచ్చానని, సర్వే పేరుతో తనకు దొంగ పత్రాలు ఇచ్చి మోసం చేశారని అనంతపురం మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన చింతా నారాయణ ఫిర్యాదు చేశారు. తన భర్త పేరు మీద మంజూరైన ఇంటి స్థలాన్ని ఆయన మరణానంతరం తన పేరు మీదకు మార్చడానికి వీఆర్వో రూ.లక్ష లంచం డిమాండ్‌ చేస్తున్నారని గుంటూరు జిల్లా చుం డూరు మండలం దున్దిపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. 2011లో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా లద్దిపల్లి గ్రామానికి చెందిన మాల వరాదమ్మ కోరారు.

Updated Date - Oct 06 , 2024 | 11:56 AM