Share News

..తవ్వుకున్నంత..!

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:45 PM

ఏదైనా పనిచేసేటప్పుడు చట్టబద్ధంగా ఉండాలి. చట్టవిరుద్ధంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం చేసే పనులకు చెక్‌ పెట్టేందుకు అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవడం పరిపాటిగా జరిగే విషయమే.

..తవ్వుకున్నంత..!
దువ్వూరు సమీప గుట్టల్లో గ్రావెల్‌ తవ్వకాలతో ఏర్పడిన గోతులు

అనుమతులు నిల్‌ - అక్రమ రవాణా ఫుల్‌ ఫ యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

దువ్వూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏదైనా పనిచేసేటప్పుడు చట్టబద్ధంగా ఉండాలి. చట్టవిరుద్ధంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం చేసే పనులకు చెక్‌ పెట్టేందుకు అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవడం పరిపాటిగా జరిగే విషయమే. కానీ అక్రమ వ్యవహారాలు దువ్వూరులో జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇటువంటి తతంగం ఎర్ర గ్రావెల్‌ తవ్వకాల విషయంలో జరుగుతోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే గ్రావెల్‌ను ఇక్కడ కొల్లగొడుతున్నారు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్న చందంగా ఎర్ర గ్రావెల్‌ అక్రమార్కులకు వరంగా మారింది.

దువ్వూరు మండలం ఎర్రగ్రావెల్‌ అక్రమ రవాణా తవ్వకాలకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి నిత్యం గ్రావెల్‌ను ట్రాక్టర్లు, మినీ లారీల ద్వారా తరలిస్తున్నారు. గ్రావెల్‌ను మెటల్‌, ఇతరత్రా రోడ్ల నిర్మాణాలకు వాడుతారు. ప్లాట్ల నిర్మాణంలో భాగంగా గ్రావెల్‌తో రోడ్లు వేస్తే అందంగా ఆకర ్షణీయంగా ఉంటాయి. ఈ కారణంగా అధిక రేటు పెట్టి దీన్ని కొనుగోలు చేస్తారు. దీంతో ట్రాక్టర్‌ యజమానులు అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వకాలను చేపట్టి పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండల పరిధిలోని దువ్వూరు గుట్టలో ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. సాధారణంగా గ్రావెల్‌ తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి. ఈ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్కులు రాత్రివేళ అడ్డుగోలు తవ్వకాలు చేస్తున్నారు. అడపా దడపా పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి వాహనాలను పట్టుకున్నా వీరు ఏమాత్రం జంకడంలేదు. ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చి తిరిగి తవ్వకాలు చేస్తున్నారు. వాహనదారులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, చాపాడు ప్రాంతాలకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గ్రావెల్‌ అక్రమ వ్యాపారాన్ని అరికట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర ్యలు తీసుకుంటాం. మైనింగ్‌శాఖ ద్వారా అనుమతులు తీసుకుని ఆ ప్రాంతంలోనే తవ్వకాలు చేపట్టాలి. ఎక్కడైతే అనుమతులు ఇస్తారో అక్కడే తవ్వకాలు చేపట్టాలి. దీనిలో రాజకీయ ఒత్తిడులు తీసుకురావడం తగదు. చర్యలు కఠినంగా తీసుకుంటాం.

జి.అక్బర్‌బాష, తహసీల్దారు, దువ్వూరు.

Updated Date - Nov 09 , 2024 | 11:46 PM