నేటి నుంచి కొత్త కిక్కు
ABN , Publish Date - Oct 15 , 2024 | 11:33 PM
జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్లు మందుబాబులను గుల్లచేశాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో ఇంకా క్వాలిటీ మద్యం ఉంటుందని మందుబాబులు ఆశించారు. అయితే అప్పటివరకు ఉన్న బ్రాండ్లన్నీ కనుమరుగైపోయాయి.
తెరుచుకోనున్న 139 మద్యం దుకాణాలు
చాలా ఏళ్లకు మళ్లీ ప్రీమియం బ్రాండ్లు
కొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ నేతలకు వచ్చిన షాపులు..
భాగస్వామ్యం కోసం ఆరాటం
(కడప-ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్లు మందుబాబులను గుల్లచేశాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో ఇంకా క్వాలిటీ మద్యం ఉంటుందని మందుబాబులు ఆశించారు. అయితే అప్పటివరకు ఉన్న బ్రాండ్లన్నీ కనుమరుగైపోయాయి. ఎప్పుడూ వినని పేర్లు, నాలుక రుచి చూడని మద్యం అమ్మేశారు. వాటికి జే బ్రాండ్ అని పేరు పెట్టేశారు. ఏపీలో మద్యంలో తాగితే ఆరోగ్యం హరి అన్న ప్రచారం బాగా సాగింది. ఇపుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ బుధవారం నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడంతో ప్రీమియం బ్రాండ్లన్నీ మళ్లీ వచ్చేశాయి. దీంతో పొరుగు రాష్ట్రాల మద్యం దిగుమతికి ఫుల్‌స్టాప్ పడనుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపలో ఆదాయం వస్తే.. క్వాలిటీ మద్యం పుణ్యమా అని మందుబాబుల ఆరోగ్యం సేఫ్ కానుంది. జిల్లాలో 139మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. దరఖాస్తు ఫీజు రూ.2లక్షలుగా నిర్ణయించింది. మొత్తం షాపులకు 3,752 దరఖాస్తులు రాగా దీని వల్ల నాన్ రీఫండబుల్ నిధులు రూ.65.14కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ అయింది.
తెరుచుకోనున్న ప్రైవేటు మద్యం దుకాణాలు
నూతన మద్యం పాలసీలో భాగంగా బుధవారం నుంచి 139 ప్రైవేటు మద్యం షాపుల ద్వారా లిక్కర్ విక్రయాలు సాగనున్నాయి. మండల కేంద్రాలు, మున్సిపల్, కార్పొరేషన్‌లలో ప్రభుత్వం లైసెన్స్ ఫీజులను నిర్ణయించింది. మొత్తం షాపుల ద్వారా సంవత్సరానికి లైసెన్స్ ఫీజు రూ.84కోట్లు జమ కానుంది. ఇక లైసెన్స్ ఫీజులు ఆరు విడతల్లో కట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది. లాటరీ ద్వారా లైసెన్స్ పొందిన వారు తొలివిడతలో రూ.14,04,15,000 చెల్లించారు.
అందుబాటులో ప్రీమియం బ్రాండ్లు
జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో జే బ్రాండ్లే దొరికేవి. వాటిని తాగలేక బార్లకు వెళ్లేవారు. అయితే బారును బట్టి అక్కడ క్వార్టర్‌పై రూ.50 నుంచి రూ.100 తేడా ఉండేది. అస్తమానం పనిచేసిన కష్టపడే కూలీలు నిద్రపోవాలంటే అలవాటు ఉన్నవాళ్లు క్వార్టర్ వేసే వాళ్లు. బార్‌లోకి వెళ్లి 70శాతం కూలీని మందుకే కట్టబెట్టేవారు. ఇప్పుడు 2019కి ముందు ఉన్న బ్రాండ్లన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 26 బ్రాండ్లు కడప గోడౌన్‌కు చేరుకున్నాయి. షాపులు పొందిన వాళ్లు మంగళవారం అర్ధరాత్రి వరకు గోడౌన్ నుంచి సరుకు తీసుకెళ్లి బుధవారం షాపుల్లో అమ్మకాలు మొదలు పెట్టనున్నారు. కడప 1వ షాపునకు బ్లాక్‌లేబుల్, ఇంపీరియల్ బ్లూ, మెక్‌డొనాల్డ్, రాయల్ స్టాగ్, కింగ్‌ఫిషర్ తదితర పాత బ్రాండ్లకు చెందిన 26 రకాలు చేరాయి. లైసెన్స్ పొందిన వారంతా డీడీలు కట్టి మందు తీసుకెళ్తున్నారు.
షాపులు దక్కించుకునే యత్నం
ప్రైవేటు మద్యం గతంలో ఓ పార్టీ లేదా లిక్కర్ మాఫియా చేతుల్లో ఉండేది. ఈసారి లక్కీడ్రాలో పాత మద్యం షాపుల వారికి దుకాణాలు దక్కలేదు. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ అనుచరులకు దక్కాయి. షాపులు దక్కని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతుతున్నారని అంటున్నారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కుమ్మక్కై ఇరువురు భాగ స్వాములుగా ముందుకెళ్తున్నారు. ఇక లిక్కర్ సిండి కేట్లపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. లిక్కర్‌లో సిండికేట్‌పై సీఎం చంద్రబాబునాయుడు కూడా సీరియస్‌గా ఉన్నారు. ఇంకా సెటిల్‌మెంట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా.. చాలా చోట్ల బుధవారం ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.