ఏకీకృత పెన్షన్ పథకం అంగీకరించం, Acceptance of Consolidated Pension Scheme
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:15 PM
కేంద్రప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ నథకాన్ని అంగీకరించేదేలేదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయకుమార్, పాలెం మహేశ్‌బాబు పేర్కొన్నారు.
కడప (ఎడ్యుకేషన్), ఆగస్టు 30: కేంద్రప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ నథకాన్ని అంగీకరించేదేలేదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయకుమార్, పాలెం మహేశ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరం డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టిన వారు మాట్లాడుతూ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎంపీఎస్ పేరును యూపీఎస్గా మార్చిందన్నారు. 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60 శాతం ఫ్యామిలీ పెన్సన్ ఇస్తామని యూపీఎస్ పెన్షన్ విధానంలో కేంద్రం ప్రకటించినా ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ఇందులో ప్రస్తావించకపోవడం ఈ పథకం అమలులో ఐచ్చితం అని పేర్కొనడంలోనే అసలు మోసం దాగి ఉందన్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ లేకుండా సర్వీసును బట్టి 50శాతం ఇచ్చే పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరించడమే తమకు ఆమోదయోగ్యమన్నారు. యూపీఎస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ అస్యూర్డ్ పెన్షన్ స్కీం నకలు అని నూతన పెన్షన్ పథకం సంస్కరణకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని ఇది తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, కె.నరసింహారావు, జిల్లా నేతలు చంద్రశేఖర్, గోపినాధ్, క్రిష్ణారెడ్డి, నాగన్న పాల్గొన్నారు.