Share News

మదనపల్లెలో రోడ్ల విస్తరణకు శ్రీకారం

ABN , Publish Date - Nov 03 , 2024 | 11:17 PM

మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో గల వందేళ్ల చింతవృక్షాలు నేలకొరుగుతున్నాయి.

మదనపల్లెలో రోడ్ల విస్తరణకు శ్రీకారం
సీటీఎం రోడ్డులో చింతచెట్లను తొలగిస్తున్న కార్మికులు

నేలకొరుగుతున్న వందేళ్ల చింతవృక్షాలు

పదిహేనేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి విస్తరణ

ఆక్రమణలు తొలగేనా..ట్రాఫిక్‌ తీరేనా..?

మదనపల్లె, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో గల వందేళ్ల చింతవృక్షాలు నేలకొరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పేరు తో వీటిని తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉందని, దీనికి పరిష్కారానికి రోడ్లు వెడల్పు చేయడమే మార్గమని స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహానబాషా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎక్కడ సభలు, సమావేశాల్లో పాల్గొన్నా..ట్రాఫిక్‌ సమస్యను ప్రస్తావిస్తూ, సమస్య పరిష్కారానికి సహకరించాలని అటు ప్రజలు, ఇటు వాహనదారులను కోరుతున్నారు. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌కు ట్రాఫిక్‌ సమస్యను వివరిస్తూ, ఎక్కడెక్కడ సమస్య ఉందో పట్టణంలో కలెక్టర్‌తో కలసి పట్టణంలో పర్యటించారు. ఇందులో భాగంగా కదిరి రోడ్డు, బెంగళూరు బస్టాండు, సీటీఎం రోడ్డు, గాంధీరోడ్డు ఏరియాలలో పర్యటించి పట్టణవాసులకు ఎదురువుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఏకరువు పెట్టారు. దీనికి పరిష్కారంలో భాగంగా రోడ్ల విస్తరణే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, అటవీ, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్తు శాఖ అధికారులతో సంప్రదించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మొదట సీటీఎం రోడ్డులో రోడ్డు పక్కనున్న చింత చెట్లను తొలగిస్తున్నారు. కార్మికులు యంత్రాలు, మిషన్లతో కొమ్మలను తొలగించగా, భారీ క్రేనతో వాటిని పక్కన పడేసే పనులు చేపట్టారు. ఇందుకోసం పాత ఎమర్జెస్సీ హాస్పిటల్‌ వద్ద, ఇటు బర్మావీధిక్రా్‌సలో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం కూడా పెద్దమొత్తంలో వర్కర్లను పెట్టి చెట్లను తొలగించనున్నట్లు చెబుతున్నారు. నిజంగా సీటీఎం రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలంటే చింతవృక్షాలను మధ్యలో వదిలేసి రోడ్డుకు అటు, ఇటు ఉన్న ఆక్రమణలు తొలగిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఆఫీసర్స్‌ క్లబ్‌ నుంచి చిత్తూరు బస్టాండు సర్కిల్‌ వరకూ ఉన్న 27-30 భారీ చింతవృక్షాలను తొలగించాల్సి వస్తోంది. పదిహేనేళ్ల క్రితం కూడా రోడ్డు విస్తరణ చేయాలని అప్పటి పాలకులు భావించినా..స్థానికుల అభ్యంతరాలు, కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో విస్తరణకు బ్రేక్‌ పడింది. రోడ్డు పక్కనున్న ఆక్రమణలను తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, పర్యావరణంతో పాటు పట్టణవాసులకు నీడనిస్తున్న చింతవృక్షాలను తొలగించడంపైనే స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 11:17 PM