కూలి పెంచాలని సివిల్ సప్లై హమాలీల ఆందోళన
ABN , Publish Date - Oct 07 , 2024 | 11:34 PM
జిల్లాలో సివిల్ సప్లయిస్ హమాలీలకు కూలి ధరలు పెంచడంతోపాటు ప్రతినెలా మొదటి వారంలోనే కూలి చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.
రాయచోటి(కలెక్టరేట్), అక్టోబరు7: జిల్లాలో సివిల్ సప్లయిస్ హమాలీలకు కూలి ధరలు పెంచడంతోపాటు ప్రతినెలా మొదటి వారంలోనే కూలి చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర ్యంలో సివిల్ సప్లయిస్ హమాలీలు ఆందోళన చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ హమాలీలకు 2024 జనవరిలోనే కూలిరేట్లు అగ్రిమెంట్ జీవో ఇవ్వాల్సి ఉండగా పది నెలలు కావస్తున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు టీఎల్ వెంకటేశ, మురళి, సివిల్ సప్లయిస్ హమాలీ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, అయూబ్బాషా, వీరాంజనేయులు పాల్గొన్నారు.
వెలుగు సంఘం సమావేశాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలి
కేవీపల్లి మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ వెలుగు సంఘం వీవో సమావేశం జరగకుండా అడ్డుకుంటున్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టీఎల్ వెంకటేశ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలోని 40 పొదుపు సంఘాల్లో దాదాపు 400 మంది సభ్యులు ఉన్నారని, కేవీపల్లి మండలంలోని అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు అధికారులను భయపెట్టి వీవో సమావేశం జరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.