రైతుకు రూ.కోటి పంపిణీ
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:53 PM
జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు.
రాష్ట్రంలో 11 మందికి... జిల్లాలో ఒకరే ఎంపిక
రూ.50 లక్షలు సబ్సిడీ అందుకుంటున్న రైతు
పథకంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి : సబ్ కలెక్టర్
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 26: జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. గురువారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో అంకిశెట్టి పశువైద్యాధికారి డాక్టర్ లారెన్స్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పశుగణాభివృద్ధి ఎన్‌ఎల్‌ఎం పథకం కింద రైతులు ఆవులు, గొర్రెలు, పొట్టేళ్లు, మేకల పెంపకాన్ని రూ.50 లక్షలతో ప్రాజెక్టు ప్రారంభిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ (రూ.50 లక్షలు) అదనంగా ఇస్తుందన్నారు. ఒకవేళ అంత పెట్టుబడి పెట్టలేని రైతులు వారి స్థోమతను బట్టి పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు ప్రారంభిస్తే, పెట్టుబడికి 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అంతా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఎల్‌ఎం పథకం కింద 11 మందికి మాత్రమే రూ.కోటి చొప్పున మంజూరు కాగా అందులో జిల్లాలోని రామసముద్రం మండలం అరికెల పంచాయతీకి చెందిన ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి మంజూరైందన్నారు. ఈ రైతు తొలుత 16 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టి, మిగిలిన 34 లక్షలు బ్యాంకు రుణం పొందారని, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ప్రారంభించాక, ఈ నివేదికలను పశువైద్యాధికారులు ఉన్నతాధికారులకు పంపుతారన్నారు. మొత్తం పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రైతుకు పెట్టుబడి కింద రూ.50 లక్షలతో పాటు సబ్సిడీ రూ.50 లక్షలు కలిపి రూ.కోటి రైతు అకౌంటులో జమ చేస్తుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రైతులు ఈ పథకంతో ఎక్కువ లబ్ధి పొందుతున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా అవగాహన పెంచుకుని ఎన్‌ఎల్‌ఎం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సబ్‌కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ లారెన్స్, సిబ్బంది పాల్గొన్నారు.