ప్రశ్నార్థకంగా వేరుశనగ సాగు..!
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:11 AM
పడమటి మండలాల్లో వేరుశనగ పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఏటేటా తగ్గుతున్న పంట సాగు విస్తీర్ణం వందల ఎకరాలకు పడిపోయిన వైనం ఆందోళనలో అన్నదాతలు
గుర్రంకొండ, అక్టోబరు 4:పడమటి మండలాల్లో వేరుశనగ పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఏటేటా సాగు విస్తీర్ణం తగుతుండడ మే కాకుండా వేరుశనగ పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది వెయ్యి ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేసిన రైతులు సకాలంలో వర్షాలు కురవక, ఒకవేళ కురిసిన అతివృష్టితో పంటలు దెబ్బతింటుండడం కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఈ ఏడాది వందల ఎకరాలకు పంట సాగు పడిపోయింది. ఈ ఏడాది మే, జూన మాసాల్లో వర్షం కురవడంతో పంట బాగా పండుతుందని కోటి ఆశలతో రైతన్నలు వేరుశనగ పంటను సాగు చేశారు. పంట సాగు మొదట్లో వర్షాలు పడడంతో పంట ఏపుగా పెరిగింది. అయితే పూత, పిందె దశలో వర్షం ముఖం చాటేయడంతో వేరుశనగ పంటలో కాయలు నాణ్యత లేక బుడ్డలుగా మారాయి. వర్షం లేక భూమి గట్టిగా మారడం తో వేరుశనగ చెట్లు ఎండిపోయాయి. చెట్లలో ఉన్న కాయలు బయటకు తీయడానికి రైతన్న పడరాన్నిపాట్లు పడుతున్నారు. ప్రతి ఏటా వరుణు డు సకాలంలో కురవకపోవడంతో రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట సాగు చేసి నష్టాలు తప్న ప్రయోజనం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్రంకొండ మండలంలో 6037 ఎకరాల్లో 2818 మంది రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో 2684 ఎకరాల్లో 1017 మంది రైతులు వేరుశనగ పంటను సాగు చేసేవారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వేరుశనగ పంట విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతూ వస్తుంది. ఈ ఏడాది మండలంలో 15 పంచాయత్లీలోని 175 గ్రామాల్లో రైతులు వేరుశనగ పంట సాగు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీపై 1300 కింటాళ్ల వేరుశనగ విత్తనకాయలను 1500 ఎకరాల్లో సాగు చేయడానికి ఇచ్చింది. ఈ క్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో కేవలం 876 ఎక రాల్లో పంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా క్షేత్ర స్థాయిలో విస్తీర్ణం అందులో సగం కూడా లేదని రైతులు అంటున్నారు. అధికారులు స్పందించి కనీసం బోర్ల కింద వేరుశనగ పంట సాగుకు అవసరమైన రాయితీ అందజేసి రైతులను ప్రోత్సహిస్తే బాగుంటుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
నష్టాలు.. అడవి పందుల బెడద
ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తనకాయలు అందజేస్తున్నా పంట సాగులో నష్టాలను, చవిచూసి చాలా మంది సాగు చేయడం మానేశారు. ఇలా పంట సాగు విస్తీర్ణం తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు. వేరుశనగ పంట సాగుకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో రైతన్నలు వేరుశనగ పంట సాగుపై ఆసక్తి చూపడం లేదు. పంట సాగు నుంచి దిగుబడి వచ్చే సమయం వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నా ప్రయోజనంలేదంటూ రైతులు పేర్కొం టున్నారు. దీనికి తోడు నెమళ్ల దాడి కూడా ఎక్కువైందంటున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
మండలంలో వేరుశనగ పంట సాగుపై రైతులకు వ్యవసాయశాఖ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో వేరుశనగ పంట విసీ ్తర్ణం పెరిగేలా తగు సూచనలు చేస్తున్నాం. వర్షాలు సరిగా కురవకపోవ డంతో పంట సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. బోర్ల కింద వేరుశనగ పంటను రైతులు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
-రత్నమ్మ, వ్యవసాయాధికారిణి, గుర్రంకొండ, మండలం.