ఆధార్‌లో మార్పులకు తప్పని తిప్పలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:45 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా, బ్యాంకులలో ఖాతాలు తెరవాలన్నా, పాఠశాలల్లో విద్యార్థులు చేరాలన్నా ఆధార్ కార్డు తప్పని సరి.
అఫ్లికేషనలో తహసీల్దార్ సంతకాలనే
అనుమతిస్తున్న ఆధార్ సెంటర్ నిర్వాహకులు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
పెద్దతిప్పసముద్రం అక్టోబర్ 25 (ఆంద్రజ్యోతి) :ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా, బ్యాంకులలో ఖాతాలు తెరవాలన్నా, పాఠశాలల్లో విద్యార్థులు చేరాలన్నా ఆధార్ కార్డు తప్పని సరి. ఆధార్‌లో పేరు మార్పు, పుట్టిన తేదీల మార్పు, చిరునామాలు ఫొటో, బయోమెట్రిక్ వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పడు అవకాశం కల్పించింది. అయితే ఇటువంటి మార్పులు చేయాలంటే పక్కా ఆధారాలతోపాటు అఫ్లికేషన ఫాంలో గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి చేశారు. కాగా పలు రకాల గెజిటెడ్ అదికారుల సంతకాలు చేయవచ్చనే నిబందన ఉన్న ప్పటికి ఆధార్ కేంద్రాల అదికారులు కేవలం తహసీల్దార్ సంత కం మాత్రమే అంగీకరిస్తుండడంతో కార్డుదారులకు అసలు సమస్యలు మొదలయ్యాయి. ప్రభుత్వం నిబందనల మేరకు ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే దరఖాస్తు ఫాంలో గెజిటెడ్ అదికారుల జాబితాలో గ్రూప్-ఏ, , గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్-బి, ఎంపీ, ఎమ్యెల్యే, మున్సిపల్ కౌన్సిలర్‌లు, తహసీల్దార్‌లు, ఎంపీడీ వో, స్కూల్ హెడ్‌మాస్టర్, వెటర్నరీ డాక్టర్, ఎంఈవో, ట్రాన్సకో ఏఈ తదితర అధికారులను పొందుపర్చారు. అటువంటి అధికారుల సంతకాలతో కార్డుదారులు సెంటర్‌కు వెళితే కేవలం తహసీల్దార్ సంతకం మాత్రమే అనుమతిస్తుండడంతో కార్డుదా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హెచఎం సంతకం చేయించినా అనుమతించలేదు
ఆధార్ కార్డుల్లో ఇంటిపేరు, అడ్రస్ మార్చుకోవాలని దరఖాస్తు ఫాంలో గెజిటెడ్ అధికారి అయిన పాఠశాల ప్రధానోపాద్యాయుడి సంతకం చేయించాను. దరఖాస్తు ఫాంలో గెజిటెడ్ అధికారుల ఆప్షన ఉంటే పాఠశాల ప్రదానోపాద్యాయుల సంతకం చేయించి మండల కేంద్రంలో ఉన్న ఆదార్ సెంటర్‌కు వెళ్లగా తహసీల్దార్ సంతకమే కావాలని లేక పోతే రిజెక్ట్ అయిపోతుందని అన్నారు. తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్క రోజు వెళ్లగా తహసీ ల్దార్ అందుబాటులో లేరు. తిరిగి మళ్లీ ఒక రోజు వెళ్లగా తహసీల్దార్ గ్రామసభలకు వెళ్లారని సిబ్బంది తెలిపారు. ఇప్పటి కైనా నిబందనలను సడలించే విధంగా అవకాశం కల్పించాలి
- నచ్చు రామాంజులు సాలేవాండ్లపల్లె పీటీఎం
ప్రభుత్వ డాక్టర్ సంతకం చేయించినా తిరస్కరించారు
నా ఆధార్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉండడంతో అడ్రస్ మార్పు చేయడం కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాను అక్కడ ఒక ఫాం ఇచ్చి గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకుని రమ్మన్నారు. మా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రి డాక్టర్ వద్ద సంతకం చేయించుకుని వచ్చాను. అందులో తప్పని సరిగా తహసీల్దార్ సంతకమే ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కు తోచడంలేదు.
- వెల్లిబోయిన రవికుమార్ పీటీఎం మండలం
పీటీఎంలో మూడు ఆధార్ సెంటర్లు ఏర్పాటు
పీటీఎం మండలంలో మూడు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశాం.ఇందులో ఒకటి పెద్దతిప్పసముద్రం, తుమ్మరకుంట, కాట్నగల్లులో ఏర్పాటు చేశారు. తుమ్మరకుంటలో డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో అక్కడ సెంటర్ నడవడంలేదు. పెద్దతిప్పసముద్రం, కాట్నగల్లులో సెంటర్లు నడుస్తున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలల్లో కేంద్రాలు నిర్వహించాలని భావించాం. అయితే పాఠశాలల్లో వారికి చదువులకు ఇబ్బందులు కలుగుతాయని మండల కేంద్రంలో సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆధార్ కేంద్రాలు నిరంతరం కొనసాగుతాయి.
-యోగానంద్, ఈవోపీఆర్డీ, పీటీఎం మండలం
విద్యార్థుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆధా ర్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసు కొనుటకు ప్రభుత్వం అవకాశం కల్పిం చింది. ఇందులో విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయా గ్రామా ల్లో ఉన్న ఆదార్ సెంటర్లలో మార్పులు, చేర్పులు చేసుకునేలా ఫాంలో సంతకాలు పెట్టి పంపిస్తున్నాం. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఆధార్ కార్డుల వివరాలను అందించాలి. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు కాని కార్డుదారులు కాని ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంతకాలు చేస్తున్నాం
- శ్రీరాములునాయక్, తహసీల్దార్, పీటీఎం మండలం