Share News

జగన్‌ వద్ద జమ్మలమడుగు పంచాయితీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:57 PM

మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనం ఫ్యాను రెక్కలను విరిచేశారు. జనాన్ని పట్టించుకోకుండా ఆయన రివర్స్‌ పాలన చేశారు.

జగన్‌ వద్ద జమ్మలమడుగు పంచాయితీ
మెడికల్‌ కళాశాల వద్ద సెల్ఫీ దిగుతున్న వైఎస్‌ జగన్‌

చెరి మూడు మండలాలు చూసుకోవాలంటూ జగన్‌ తీర్పు

ఒప్పుకోని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గం

కాక లేపుతున్న వైసీపీ రాజకీయాలు

(కడప-ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనం ఫ్యాను రెక్కలను విరిచేశారు. జనాన్ని పట్టించుకోకుండా ఆయన రివర్స్‌ పాలన చేశారు. అంతే అదను చూసి ఓటర్లు వాత పెట్టారు. ఐదేళ్లు జగన్‌ హయాంలో ఒక్క పులివెందులలో తప్ప సొంత జిల్లాకు తన మార్కు డెవల్‌పమెంటు చూపించలేని పరిసప్థితి. చివరి రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి పట్టాలు ఎక్కలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ఉత్త ఫ్యాక్టరీగా మారింది. దీంతో ఎన్నికల్లో జనం వైసీపీ బ్యాచ్‌ను ఇంటికే పరిమితం చేశారు. సీఎంగా ఉన్న ఐదేళ్లూ కేవలం వైఎ్‌స జయంతి, వర్ధంతి, క్రిస్మస్‌ వేడుకలకు మాత్రమే జగన్‌ వచ్చేవారు. ఇప్పుడు పార్టీ ఓడిన తరువాత తరచూ ఇడుపులపాయ, పులివెందులకు వస్తున్నారు. పార్టీని చక్కదిద్దే పనిచేస్తున్నారు. మంగళవారం జగన్‌ ఇడుపులపాయ వచ్చారు. జగన్‌ ముందుకు జమ్మలమడుగు పంచాయితీ వచ్చింది.

సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో పులివెందుల, బద్వేలు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. మిగతా అన్ని స్థానాలను టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ పరాజయాన్ని వైసీపీ నేతలు ఊహించలేకపోయారు. 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామనే దొమ్మ ధైర్యంతో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, పనికిరాని మాటలతో జనాలకు దూరమయ్యారు. ఇప్పుడు పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో జమ్మలమడుగు నియోజకవ్గర్గం ప్రత్యేకమైనది. కీలకమైన ఫ్యాక్షన్‌ ఏరియా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లింది.

జగన్‌ పార్టీ పెట్టిన తరువాత సుఽధీర్‌రెడ్డి హార్డ్‌కోర్‌ కార్యకర్తగా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అయితే ఇరువర్గాల మధ్య సఖ్యత లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇరువురు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం అక్కడే ఇన్‌చార్జిగా ఉంటున్నారు. ఏడాది క్రితం రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా ఈ ఇద్దరి వర్గాల మధ్య ఉప్పు నిప్పుగా ఉంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుపై జగన్‌కు ఫిర్యాదులు వచ్చాయంటారు. జమ్మలమడుగు ఇన్‌చార్జికి సంబంధించి పదిరోజుల క్రితం జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాధరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారని అంటారు. ఆ భేటీలో ఇన్‌చార్జిని మార్చే విషయం గురించి చర్చ జరిగినా నిర్ణయం జగన్‌కే వదిలేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం ఇడుపులపాయలో జగన్‌ జమ్మలమడుగు జగడంపై దృష్టి సారించారంటారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో జగన్‌ సుదీర్ఘంగా రెండుగంటల పాటు మాట్లాడారని అంటున్నారు. అయితే ఇద్దరూ కూడా ఎవరి వాదన వారు వినిపించారని సమాచారం. చివరకు జగన్‌ మధ్యేమార్గంగా.. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అప్పజెప్పగా.. ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం మండలాల బాధ్యతను మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చూసుకోవాలని చెప్పారంటారు. అయితే ఈ ప్రతిపాదనను సుధీర్‌రెడ్డి తిరస్కరించి మీటింగ్‌ సమయంలోనే బయటికి వచ్చారని అంటున్నారు. జగన్‌ పంచాయితీ చేసినా జమ్మలమడుగు జగడం తేలకపోవడం చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

మళ్లీ మంచిరోజులు వస్తాయ్‌.. అధైర్యపడొద్దు

ప్రజాదర్బార్‌లో జగన్‌

పులివెందుల/ వేంపల్లె, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మళ్లీ మంచిరోజులు వస్తాయ్‌ ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జగన్‌ పులివెందులకు వచ్చారు. మంగళవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడ ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడారు. వేంపల్లెకు రోడ్డుమార్గన చేరుకుని అక్కడ పలువురి నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. 4గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారు. క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వారివారి వ్యక్తిగత సమస్యలను ఆయనకు విన్నవించారు. ఎవరు అధైర్యపడద్దని త్వరలోనే మంచిరోజులు వస్తాయని ఆయన వారికి భరోసా ఇచ్చారు. సెల్ఫీలు, పలకరింపులతో ఆయన ప్రజాదర్బార్‌ కార్యక్రమం సాగింది. రాత్రి 8గంటల వరకు ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంపల్లె నుంచి పులివెందులకు వస్తున్న మార్గమధ్యంలో జగన్‌ మెడికల్‌ కళాశాల వద్ద వాహనాన్ని సెల్ఫీ దిగారు. బుధవారం పులివెందులలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 11:57 PM