Badvel Student Case: బద్వేల్ ఘటనలో నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చిన కడప ఎస్పీ
ABN , Publish Date - Oct 20 , 2024 | 06:58 PM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బద్వేల్ విద్యార్థి ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు. బద్వేల్ పరిధిలోనే మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిందితుడు విగ్నేష్ తగలబెట్టాడని ప్రకటించారు.
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బద్వేల్ విద్యార్థిని కేసులో నిందితుడు విగ్నేష్‌ను కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు. బద్వేల్ పరిధిలోనే మైనర్ బాలికపై పెట్రోల్ పోసి విగ్నేష్ తగలబెట్టాడని ప్రకటించారు. ‘‘బాధితురాలు, విఘ్నేష్ మధ్య చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చాలా కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. 6 నెలల క్రితం విఘ్నేష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి మాట్లాడుకుందాం అని ఇద్దరూ కలిసి నిన్న అడవిలోకి వెళ్లారు. ఇష్టపూర్వకంగానే కలిశారు. పెళ్లి చేసుకోవాలంటూ విఘ్నేష్‌ను బాధితురాలు ఒత్తిడి చేసింది. దీంతో విగ్నేష్ ప్రణాళిక ప్రకారం పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ రోజు మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఘటన జరిగిన ఒక్కరోజు లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం’’ అని ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే విగ్నేష్ హత్యకు పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్ చెప్పారు. ముందుగానే బాటిల్‌లో అర లీటర్ పెట్రోల్ తీసుకెళ్లాడని వెల్లడించారు. అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ముందస్తు పథకం వేసి అమ్మాయిని హత్య చేశాడని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే కేసును ఛేదించిన డిఎస్పీ, బృందాన్ని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు.
అసలేం జరిగిందంటే..
కాగా విగ్నేష్ దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్ధిని (16) మృతి చెందిన విషయం తెలిసిందే. విఘ్నేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా బాధితురాలు ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విగ్నేష్ కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. విగ్నేష్ భార్య ప్రస్తుతం గర్భవతిని తెలుస్తోంది. పెళ్లైనప్పటికీ విద్యార్థినితో స్నేహాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకి ఫోన్ చేసి కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆమె కళాశాల నుంచి ఆటోలో బయలుదేరింది. విఘ్నేశ్ మధ్యలో అదే ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కిలో మీటర్ల దూరంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్ల పొదలోకి వెళ్లారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించాడు. కాగా కాలిన గాయాలతో విద్యార్ధిని కేకలు వేయడంతో గమనించిన కొందరు మహిళలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు
ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు.. అసలేమైందంటే..