Share News

కబ్జాదారులను వదిలేసి పేదలపై పగ

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:34 PM

గత ప్రభుత్వ హయాంలో స్వయానా జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని.. భూములు ఆక్రమించి కంచెలు వేసుకున్న కబ్జాదారులను వదిలేసి గుడిసెలు వేసుకున్న పేదలపై అధికారులు పగ చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

కబ్జాదారులను వదిలేసి పేదలపై పగ
బహిరంగ సభలో మాట్లాడుతున్న రామక్రిష్ణ

బద్వేలులో వైసీపీ, టీడీపీ సిండికేట్‌ రాజకీయాలు

పేదల గుడిసెల జోలికొస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ

బద్వేలు, అక్టోబరు 1: గత ప్రభుత్వ హయాంలో స్వయానా జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని.. భూములు ఆక్రమించి కంచెలు వేసుకున్న కబ్జాదారులను వదిలేసి గుడిసెలు వేసుకున్న పేదలపై అధికారులు పగ చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ మంగళవారం బద్వేలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామక్రిష్ణ మాట్లాడుతూ భూ యజమానుల రికార్డులను సైతం మాయం చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బావమరిది వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాచేశారని, టీడీపీ వారు కూడా కబ్జాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సిండికేట్‌ అయి రాజకీయాలు చేశారన్నారు. పేదవాడు రెండు సెంట్ల జాగా కోసం భూ పోరాటం చేస్తే వాటిని కూల్చేసి అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల గుడిసెల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని భూ ఆక్రమణల చరిత్రను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ అనుచరులు, బంధువుల పేరుతో భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని.. మదనపల్లెలో లాగే బద్వేలులో కూడా భారీ స్థాయిలో భూ కబ్జాలు జరుగుతున్నాయన్నారు.

అనంతరం సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఓబులేసు, ఈశ్వరయ్య మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో 40 మంది భూ ఆక్రమణల గురించి గతంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే రెవెన్యూ అధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. భూ కబ్జాదారులను వదిలేసి పేదలకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రామయ్య, వెంకటశివ, సుబ్రమణ్యం, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, పీవీ రమణ, ఇమ్మానుయేల్‌, విజయమ్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:34 PM