MP Avinash: పోలీసుల అదుపులో అవినాష్.. వేములలో ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:05 PM
Andhrapradesh: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్తున్న అవినాష్‌ను అడ్డుకుని పులివెందులకు తరలించారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది.
కడప, డిసెంబర్ 13: జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేములలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని (YSRCP MP Avinash Reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్తున్న అవినాష్‌ను అడ్డుకుని పులివెందులకు తరలించారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై మాట్లాడేందుకు తాహశీల్దారు కార్యాలయానికి వెళ్లేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. అయితే అవినాష్ రెడ్డి వెళ్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు.
ఆ రూట్లో వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త
కాగా... సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో పులివెందులలో గొడవలు జరుగుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఉదయం నుంచి ఉద్రిక్తత పరస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల కోసం రేపు నామినేషన్ వేయాలంటే ఈరోజు వీఆర్వోకు పన్నులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి తహశీల్దార్ కార్యాలయంలో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తహశీల్దార్ కార్యాలయంలో వద్ద వైసీపీ వర్గీయులను టీడీపీ వారు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం వద్దకు టీడీపీ, వైసీపీ వర్గీయులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి వేములకు వచ్చారు. అవినాష్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు భారీగా అక్కడకు చేరుకున్నారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగునీటి సంఘాల ఎన్నికల సమయంలో టీడీపీ వర్గీయులను దరిదాపుల్లోకి కూడా రానీయని పరిస్థితి. టీడీపీ కార్యకర్తలను నామినేషన్ వేసేందుకు కూడా వెళ్లనీయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాజాగా సాగునీటి సంఘం ఎన్నికల నేపథ్యంలో పన్నులు కట్టేందుకు వేముల తహశీల్దార్ కార్యాలయంలోకి వస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. అవినాష్ రెడ్డి అక్కడకు రావడంతో భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎంపీ అవినాష్ రెడ్డి తమ వాహనంలో పులివెందులకు తరలించారు. అవినాష్ రెడ్డి ఉంటే గొడవలు జరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వెంటనే ఎంపీని అక్కడి నుంచి పులివెందుల వైసీపీ కార్యాలయానికి తరలించివేశారు. ఎంపీని బయటకు రానీయకుండా పోలీసులు అక్కడే కాపు కాస్తున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!
జగన్ అక్రమాస్తుల కేసు... తాజా అప్‌డేట్ ఇదే
Read Latest AP News And Telugu News