జడ్పీ సీఈవోగా ఓబులమ్మ బాధ్యతలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 11:31 PM
జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈవో)గా సి.ఓబులమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.
23 రోజుల తర్వాత
కడప రూరల్, అక్టోబర్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈవో)గా సి.ఓబులమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో డీఎల్‌డీవోగా పనిచేస్తున్న ఈమెను సెప్టెంబర్ 22న వైఎస్సార్ కడప జడ్పీ సీఈవోగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ మరుసటిరోజే ఆమే డీఎల్‌డీవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఎందుకో ఏమోకాని బదిలీ అయిన 23 రోజుల తరువాత మంగళవారం ఇక్కడకు వచ్చి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈమె స్థానంలో సీఈవోగా ఉన్న ఎం.సుధాకర్‌రెడ్డిని గత నెల 22న పుట్టపర్తి జిల్లాకు డీఎల్‌డీవోగా బదిలీ చేశారు. ఆయన మంగళవారం రిలీవ్ అయ్యారు. కాగా.. ఓబులమ్మ జడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత కలెక్టర్ లోతేటి శివశంకర్‌ను, జడ్పీ చైర్‌పర్సన్ జె.శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన చాంబర్‌లో ఉన్న సీఈవోను పలువురు జడ్పీటీసీలు, డిప్యూటీ సీఈవో మైఽథిలి, పరిపాలనా విభాగం ఏవో భాస్కర్‌రెడ్డి, డీపీఆర్‌సీ ఏవో బండపల్లి నాగభూషణం, ప్రభాకర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ.. జడ్పీశాఖలోని ఆయా విభాగాల అధికారులు, పాలకమండలి సహకారంతో జిల్లా పరిషత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. అభివృద్ధి పనులను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి పల్లెసీమల ప్రగతికి పాటుపడతామన్నారు.
23న జడ్పీ సర్వసభ్య సమావేశం
జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని 23న ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ హాలులో నిర్వహిస్తున్నట్లు సీఈవో సి.ఓబులమ్మ తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులతో పాటు గౌవర సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకావాలని కోరారు. అలాగే కడప, అన్నమయ్య జిల్లాల్లోని అధికారులు వారి ప్రగతి నివేదికలతో తప్పక హాజరుకావాలన్నారు.