లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ సీజ్
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:15 PM
కాసిన్ని కాసులకు కక్కుర్తి పడి పీలేరు పట్టణంలో గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌ను పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగనిర్ధారణ నిషేధ చట్టం) అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పీసీపీఎన్డీటీ అధికారులు
పీలేరులో ఘటన
పీలేరు, సెప్టెంబరు 13: కాసిన్ని కాసులకు కక్కుర్తి పడి పీలేరు పట్టణంలో గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌ను పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగనిర్ధారణ నిషేధ చట్టం) అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గతంలో ఇదే అభియోగాలపై సీజ్ అయినప్పటికీ ఏమాత్రం జంక కుండా అదే ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా మరో కొత్త మెషీన్‌తో స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయారు. పవిత్ర మైన వైద్య వృత్తిలో ఉంటూ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పదే పదే లింగ నిర్ధారణకు పాల్పడుతున్నట్లు తెలుసుకుని తెల్లమొహాలు వేశారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసినా తీరు మార్చుకోని ఆ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, జిల్లా పీసీపీఎన్డీటీ యాక్ట్ నోడల్ అధికారి డా.ఉషశ్రీ, పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ దేవశిరో మణి శుక్రవారం పీలేరులోని ఎల్బీఎస్ రోడ్డు, రైల్వేగేటు పక్కనున్న నోబుల్ నర్సింగ్ హోంలో నడుస్తున్న స్కానింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆ సమయంలో నర్సింగ్ హోం అధినేత డా.జి.బాషా స్వయంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ వారికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో ఆసు పత్రి, స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేయాల్సి రావడంతో నిబంధనల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గతంలోనూ ఆ స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు డా.ఉషశ్రీ, దేవశి రోమణికి తెలపడంతో వారు దాని గురించి డా.జి.బాషాను వాకబు చేయగా అవునని ఆయన సమాధానం చెప్పారు. సీజ్ చేసిన స్కానింగ్ కేంద్రంలోని మెషీన్లను వాడడం లేదని, కొత్త మెషీన్లతో స్కానింగ్ చేస్తున్నట్లు చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. పీలేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పటి వైద్య శాఖాధికారులు, పీసీపీఎన్డీటీ అధికారులు దాడులు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్లు కనుగొని స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారని, సీజ్ చేసిన కేంద్రం స్థానంలో తాను కొత్త కేంద్రం నడుపుతున్నట్లు డా.బాషా వారికి సమాధానం ఇచ్చారు. దీంతో వారు చేసేదిలేక ఈ విషయాన్ని రాయచోటి ఆర్డీవో రంగస్వామితో సహా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించా రు. వారి ఆదేశాల మేరకు స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ డా.జి.బాషా పదేపదే లింగ నిర్ధారణ పరీక్ష లు చేస్తుండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికా రులు నిర్ణయిస్తారని, వారి ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని తెలిపారు. పీలేరు తహసీల్దారు భీమేశ్వరరావు, ఎస్ఐ బాలకృష్ణ సమక్షంలో స్కానింగ్ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ విషయం పీలేరులోని వైద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.