‘అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను సస్పెండ్ చేయాలి’
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:10 AM
జిల్లాలో దళితుల భూములను అగ్రవర్ణాల వారికి కట్టబెట్టిన తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేయాలని మాలమహానాడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు రామాంజి ఇమ్మానియేలు, తాళ్లపాక వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
కడప మారుతీనగర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దళితుల భూములను అగ్రవర్ణాల వారికి కట్టబెట్టిన తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేయాలని మాలమహానాడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు రామాంజి ఇమ్మానియేలు, తాళ్లపాక వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇం దుకు నిరసనగా సోమవారం ఆర్టీసీ బస్టాండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలంలో వందలాది ఎకరాల భూములను అన్యాక్రాం తం చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈశ్వరయ్య అనే తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారే కానీ ఆనలైన రద్దు చేయలేదన్నారు. అలాగే ప్రొద్దుటూరు తహసీల్దార్ సాగించిన అవినీతి, అక్రమాలు, ప్రస్తుత అట్లూరు తహసీల్దార్‌గా సేవలందిస్తున్న అధికారిణి సుమారు 250 ఎకరాలను పెత్తందారులకు కట్టబెట్టిన వైనంపై నిప్పులు చెరిగారు. అలాగే మైదుకూరు మండలంలో జరిగిన భూ దోపిడీపై విచారణ చేపట్టాలన్నారు. అంతేకాకుండా చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, కడప, ఖాజీపేట, తదితర మండలాల తహసీల్దార్ల భూ అక్రమాలపై సీబీఐచే ఆరా తీయాలన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు వెంకటరమణ, ఉల్లి కిరణ్, సి.కె. కుమార్, రాయలసీమ అధ్యక్షుడు ఓబులేసు, పి. సుధాకర్ (ఆళ్లగడ్డ) మహిళా నాయకురాలు బి. నిత్యమ్మ, పి. సుజాత తదితరులు పాల్గొన్నారు.