Share News

మహిళామణుల సారధ్యంలో... నేడు జడ్పీ సమావేశం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:40 PM

జిల్లాప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జడ్పీ మీటింగ్‌ హాలులో చైర్‌పర్సన్‌ జె.శారద అధ్యక్షతన నిర్వహించనున్నారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళం విప్పి పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు.

మహిళామణుల సారధ్యంలో... నేడు జడ్పీ సమావేశం

సమస్యలపై చర్చ సాగేనా

వ్యవసాయాన్ని గట్టెక్కించేనా

పంటనష్టంపై ఊరట కలిగేనా

తాగునీటి స్కీంల పనితీరు మెరుగుపడేనా

నేతల గళంపై జనం గంపెడాశ

ఉమ్మడి జడ్పీ కార్యాలయంలో బుధవారం ఓ విశేషం చోటు చేసుకోనుంది. జడ్పీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశానికి మహిళామణులు సారధ్యం వహించనున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జె.శారద, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, ఇన్‌చార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌, జడ్పీ సీఈవో ఓబులమ్మ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మహిళల ఆధ్వర్వంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో అయినా.. తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

కడప రూరల్‌, అక్టోబరు 22 (అంధ్రజ్యోతి): జిల్లాప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జడ్పీ మీటింగ్‌ హాలులో చైర్‌పర్సన్‌ జె.శారద అధ్యక్షతన నిర్వహించనున్నారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళం విప్పి పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. 2024 ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ, మినుము తదితర పంటలు పూర్తిగా ఎండిపోవడంతో బాధిత రైతులు వాటిని పశువులకు వదిలేశారు. దాదాపు 3,509 హెక్టార్లలో పంటలు ఎండిపోగా ఇందులో 2,858 హెక్టార్లలో మినుము, 651 హెక్టార్లలో వేరుశనగ ఉన్నట్లు వ్యవసాయాఽధికారులు నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అలాగే అక్టోబరు 15 నుంచి విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ఖరీఫ్‌ చివరిదశలో నూర్పిళ్లకు సిద్ధంగా ఉన్న వరి, మినుము, మొక్కజొన్న పంటలు 1,132 మంది రైతులకు సంబంధించి 2241.66 ఎకరాలలో దెబ్బతిన్నాయి. ఇలా ఖరీ్‌ఫలో అనావృష్టి, అతివృష్టి వర్షాల కారణంగా మొత్తంగా 10,941 ఎకరాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో ఖరీఫ్‌ కష్టాలను వెంటబెట్టుకొని రబీసాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతకు అవసరమైన రుణాలను బ్యాంకు అధికారులు సకాలంలో అందించకుండా మీనమేషాలను లెక్కిస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పూర్తిస్థాయిలో ఇసుక ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. పైగా ఇసుక, గ్రావెల్‌ అక్రమ తరలింపు సాగుతున్నప్పటికి అధికారుల చర్యలు కానరావడం లేదు. భవననిర్మాణ రంగం కుదేలు కావడంతో పనులులేక కూలీలు వలసబాట పట్టారు. ఇక జిల్లాలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ కాలువలు శుభ్రపరిచేవారే కరువయ్యారు. వెరసి ప్రజలు దోమకాటుకు లోనై విషజ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు చాలా వరకు పాఠశాలలు ఉరుస్తున్నాయి. వైద్యశాలల్లో మందుల కొరత వేధిస్తోంది. వీటన్నింటిపై చర్చసాగించి ప్రజలకు న్యాయం చేయాల్సిన గురతర బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది. కానీ పై సమస్యలపై... ఎంతమేర చర్చజరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రజలు మాత్రం జిల్లాలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు గళంవిప్పి పరిష్కారం చూపుతారనే గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

శాఖల వారీగా పరిశీలిస్తే...

ఫ 2024 ఖరీఫ్‌ పంటలకు కష్టకాలం దాపురించింది. నైరుతి రుతుపవనాలు అసమతుల్య వర్షాలను కురిపించడంతో వర్షాధారం పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో 403.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 299.5 మి.మీ మాత్రమే నమోదవడంతో చాలా వరకు పంటలు ఎండిపోయాయి. ఇప్పటికే వేరుశనగ, మినుము తదితర పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు పశువులకు వదిలేశారు. 2024 ఖరీఫ్‌లో 75,189 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా 51,518 హెక్టార్లు మా త్రమే సాగుకు నోచుకున్నాయి. ఇందులో వర్షాభావ పరిస్థితుల కారణంగా 8,700 ఎకరాలు, అతివృష్టి వర్షాల కారణంగా 2,241 ఎకరాల్లో పంటలు దెబ్బతిని రూ.కోట్ల లో పంట నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన నష్టపరిహారం, పంటల బీమా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు జిల్లా రైతులకు సక్రమంగా అందడంలేదు. వీటిపై ప్రధానచర్చ జరగాల్సి ఉంది.

- ఉమ్మడి కడప జిల్లాలోని బాల, బాలికల వసతిగృహాల నిర్వహణకు మంజూరై న నిధులు ఖర్చు చేస్తున్నా 60శాతం వసతి గృహాల్లో తాగునీరు ఇతర మౌలిక వసతులు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. బీసీ సంక్షేమం ద్వారా బీసీ, ఈబీసీ విద్యా ర్థులకు గతేడాదికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులు చాలా మందికి విడుదల కావాల్సి ఉంది. మైనార్టీ సంక్షేమం కింద ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై సభ్యులు చర్చించాల్సి ఉంది.

- ఉమ్మడి కడప జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పఽథకం ద్వారా జిల్లాలోని 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల ద్వారా గ్రామ స్థాయిలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు చాలావరకు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మౌలిక సదుపాయాలైన తాగునీ రు, మరుగుదొడ్లు, ఇతరత్రా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాల్సిన ఐసీడీఎస్‌ ఆధికారులు దాన్ని పూర్తిగా మరిచిపోయారనే ఆరోపణలున్నాయి. వీటిపై చర్చ జరగాల్సి ఉంది.

- జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే సీపీడబ్ల్యూఎస్‌ స్కీంల పనితీరు లోపభూయిష్టంగా మారింది. వీటికి సంబంధించి ఇటీవల జరిగిన టెండర్లు నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టానుసారం చేపట్టారనే అరోపణలున్నా యి. వర్షాలు కురుస్తున్నా జిల్లాలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. ఇటీవల కడప నగరంలో ఐదురోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేశా రు. ఈ నేపథ్యంలో వాటర్‌స్కీంపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.

- ఉమ్మడి కడప జిల్లాలో చిన్న, మధ్యతరహా, భారీ నీటివనరుల నిర్మాణాలున్నా యి. ఇందులో 1,841 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 1,11,225 ఎకరాల ఆయకట్టు, 4 మధ్యతరహా నీటిపారుదల వనరుల ద్వారా 59,955 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ అయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. రూ.18 కోట్ల జైకా నిధులతో చేపడుతున్న బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ఏళ్లతరబడి నత్తనడక న సాగుతూనే ఉన్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలపైనా, కేసీకెనాల్‌, పులివెందుల బ్రాంచ్‌కెనాల్‌, తెలుగుగంగకు నీటి కేటాయింపులపైనా చర్చసాగాల్సి ఉంది.

Updated Date - Oct 22 , 2024 | 11:40 PM