Share News

నీరున్నా నిరుపయోగమే...

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:20 AM

వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి జలాశయాలు నిర్మించినా కాల్వలు లేకపోవడంతో రైతులకు నీరు అందడం లేదు.

నీరున్నా నిరుపయోగమే...
కళకళలాడుతున్న సర్వరాయసాగర్‌ రిజర్వాయర్‌

తాగునీరు ఇవ్వలేని దుస్థితి

వీరపునాయునిపల్లె, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి జలాశయాలు నిర్మించినా కాల్వలు లేకపోవడంతో రైతులకు నీరు అందడం లేదు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో తొలిదశలో 35వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా 1500 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గండికోట జలాశయం నుంచి సర్వరాయసాగర్‌, వామికొండ రిజర్వాయర్లకు నీరు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వకపోవడంతో నీళ్లు ఉన్నా ఉపయోగంలో లేని దుస్థితి. ఈ రెండు జలాశయాల కింద కొన్ని ప్రధాన కాల్వలు, పిల్వ కాల్వలు నిర్మించేందుకు దాదాపు రూ.24 కోట్ల వ్యయతో అంచనాలు రూపొందించారు. నిధులు మంజూరు కావడంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా కట్టవద్ద ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వలు, రివిట్‌మెంట్‌ పనులు పూర్తి చేయించేందుకు భూమిపూజ చేపట్టారు. ఆపై ఈ విషయం మరచిపోవడంతో ఈ రిజర్వాయర్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సర్వరాయసాగర్‌ ఎడమకాల్వ కింద 9.6కిలోమీటర్లు ప్రధాన కాల్వలు తవ్వాలి. ఆరు కిలోమీటర్ల మేర పిల్ల కాల్వల పనులు పూర్తి చేయాలి. అలాగే కుడికాల్వ కింద 16.5కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు నిర్మించాల్సి ఉంది. 9కిలోమీటర్ల మేర పిల్ల కాల్వలు పూర్తిచేయాల్సి ఉంది. సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాల్లో నీళ్లు ఉన్నా కాల్వలు సరిగా లేకపోవడంతో సరఫరా చేయలేకపోతున్నారు. సర్వరాయసాగర్‌ జలాశయం కింద వృథాగా ఊట నీరు పోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు పోతుండటం పట్ల సాగుచేసిన పంట పొలాల్లో ఊటనీరు వస్తుండటంతో సాగుచేసిన పంట పాడైపోతోంది. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మిగిలి ఉన్న రివిట్‌మెంట్‌, పల్లకాల్వల పనులను పూర్తిచేయించి మండల వాసులు కన్న కలలు సాకారం అయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Dec 28 , 2024 | 12:20 AM