నేడు రాత్రి రోడ్లపై అల్లర్లకు పాల్పడితే తాట తీస్తాం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:27 PM
డిసెంబరు 31వ రాత్రి రోడ్లపై అల్లర్లకు పాల్పడితే తాట తీస్తామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
కడప క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : డిసెంబరు 31వ రాత్రి రోడ్లపై అల్లర్లకు పాల్పడితే తాట తీస్తామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడి ఆదేశాల మేరకు సోమవారం ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు డ్రంకెన డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. 31న రాత్రి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రిళ్లు ఎవరైనా రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. న్యూయర్ వేడుకలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలే తప్ప రోడ్లపై మద్యంతాగి ప్రవర్తిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. రాత్రి 10 నుంచి 5 వరకు ప్రతి పోలీసుస్టేషన ఆధ్వర్యంలో అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంకెన డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు 20 మంది స్పెషల్‌టీం, మొబైల్ టీంగా ఏర్పడి స్పీడ్ లేజర్ గన ద్వారా వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సీసీ కెమెరాలు, బాడీవార్న్ కెమెరాల ద్వారా వీడియో రికార్డు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, మోటారు వాహనాల చట్టం 185 ప్రకారం నేరమన్నారు. దానికి రూ.10వేలు జరిమానా లేక ఆరు నెలల శిక్ష ఉంటుందన్నారు.డ్రైవింగ్ లైసెన్సును 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. నగరంలోని ఐటీఐ సర్కిల్‌లో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి, గువ్వలచెరువు ఘాట్ రోడ్డు, రిమ్స్ రింగు రోడ్డు, మిగతా బైపాస్ రోడ్డు ద్వారా రాత్రి 10గంటల నుంచి ఉదయం 3 వరకు రాకపోకలు నిలి పేస్తామన్నారు. అలాగే మద్యం షాపులు కూ డా ప్రభుత్వం అనుమతించిన సమయం వరకే తెరిచి ఉంచాలన్నారు. మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. అధిక వేగం, పబ్లిక్ ప్రదేశాల్లో రేసింగ్ నేరమన్నారు. వేడుకల పేరుతో మహిళల పట్ల ఇతర వాహనదారుల పట్ల అసభ్యకరంగా, అమర్యాదగా ప్రవర్తించరాదన్నారు. కొందరు వ్యక్తులు శుభాకాంక్షల పేరుతో ఈవ్‌టీచింగ్, స్నాచింగ్ చేసే అవకాశాలున్నందున మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లపై కేక్‌లు కట్ చేసి ట్రాపిక్‌జామ్ చేసి పబ్లిక్‌కు ఇబ్బంది కలిగించరాదన్నారు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామాన్నరు. డీజేలకు అనుమతి లేదన్నారు. రోడ్లపై ఉన్న బారికేడ్లు కానీ, డివైడర్లు కానీ, రోడ్లకు ఇరువైపులా ఉన్న మొక్కలను కానీ డ్యామేజ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.రోడ్లపై కానీ, జంక్షనలలో కానీ టపాకాయలు పేల్చరాదన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు నూతన సంవత్సరం సం దర్భంగా ఎక్కడికిపోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారన్న విషయాలపై తప్పనిసరిగా నిఘా పెట్టాలని సూచించారు.
నేటి రాత్రి నగరంలో పోలీసు ఆంక్షలు: సీఐ
డిసెంబరు 31న రాత్రి కడప నగరంలో పో లీసు ఆంక్షలు విధించినట్లు కడప వనటౌన సీఐ రామక్రిష్ణ తెలిపారు. కోటిరెడ్డిసర్కిల్, సెవెనరోడ్స్, క్రిష్ణాసర్కిల్‌లలో న్యూఇయర్ వేడుకలకు అనుమతి లేదన్నారు. ఈ వేడుకలు కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగి బైకులు నడిపితే చర్యలు తప్పవన్నారు. రాత్రిళ్లు చిన్నపిల్లలను రోడ్లపై తిప్పరాదని, నిబంధనలు పాటించాలన్నారు.