YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:13 PM
కడప వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన భేటీ అయ్యారు. మంగళవారం ఇడుపులపాయెలోని తన నివాసంలో.. వారితో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ.. వారిని సూచించినట్లు తెలుస్తోంది.
కడప, డిసెంబర్ 24: ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే.. తన సత్తా చాటింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అలాంటి వేళ.. పార్టీలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు.. వీడుతోన్నారు. ఆ క్రమంలో కడప నగర పాలక సంస్థలోని పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లను కాపాడుకొని.. కడప కార్పొరేషన్‌ను నిలుపుకొనేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా కడప నగర పాలక సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
మంగళవారం ఇడుపులపాయలోని తన స్వగృహంలో వారితో భేటీ అయ్యారు. ఏ ఒక్కరు పార్టీ వీడ వద్దని.. కార్పొరేటర్లతోపాటు వైసీపీ నేతలతో పార్టీ అధినేత మంతనాలు జరుపుతోన్నట్లు తెలుస్తొంది. మీ సమస్యలను ఏదో ఒక రూపంలో పరిష్కరిస్తానని.. తనను నమ్మలంటూ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ పేర్కొన్నట్లు సమాచారం.
వైసీపీ అధికారానికి దూరం కావడంతో.. కడపలోని ఆ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు ఇటీవల టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. మరికొందరు కార్పొరేటర్లు సైతం అదే దారిలో నడిచేందుకు సిద్ధమైనట్లు ఓ చర్చ సైతం జిల్లాలో వాడి వేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగమేఘాల మీద రంగంలోకి దిగి..వారిని పార్టీ మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సోమవారం కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడప ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆర్, మాధవీ రెడ్డికి కుర్చి వేయక పోవడంతో ఆమె నిరసన వ్యక్తం చేశారు. గత సమావేశంలో సైతం ఆమె పట్ల ఇదే విధంగా వ్యవహరించిన విషయం విధితమే. అలాగే 54 ప్రజా సమస్యలను ఈ సమావేశంలో చర్చించేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ వాటిని చర్చించేందుకు మేయర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి విలేకర్ల సమావేశంలో కాస్తా ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా మేయర్ వ్యవహార శైలిని ఎండగట్టారు. అదీకాక... కడప నగర పాలక సంస్థ సమావేశంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటాపోటీగా నిరసనలు చేట్టారు.ఈ మొత్తం ఎపిసోడ్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగి.. తన పార్టీకి చెందిన కార్పోరేటర్లను బుజ్జిగింప చేసుకొనే పనిలో పడ్డారని ఓ చర్చ సైతం సాగుతోంది.
For AndhraPradesh News And Telugu News