Share News

AP Election 2024: కసితీరా ఓటేశారు!..

ABN , Publish Date - May 10 , 2024 | 04:18 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు కసితీరా ఓటేశారు. పోస్టల్‌లో బ్యాలెట్ల ద్వారా దాదాపు 5లక్షల మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

AP Election 2024: కసితీరా ఓటేశారు!..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 4.32 లక్షలు

2019లో కంటే రెట్టింపుగా నమోదు

ఈ పట్టుదల దేనికి సంకేతమని చర్చలు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు కసితీరా ఓటేశారు. పోస్టల్‌లో బ్యాలెట్ల ద్వారా దాదాపు 5లక్షల మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2,38,468 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు 4,32,222 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. గురువారం (9న) జరిగిన పోలింగ్‌ను కూడా కలుపుకుంటే 5లక్షల మంది వరకూ ఓట్లు వేసి ఉంటారని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలను ఈసీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.


ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత ఐదు రోజుల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో మండుటెండను సైతం లెక్కచేయకుండా, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. కొన్నిజిల్లాల్లో అధికారులు మీ ఓట్లు ఇక్కడ లేవని అక్కడకు, అక్కడ లేవని ఇక్కడకు తిప్పినా పట్టువదలని విక్రమార్కుల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. గతంలో కన్నా ఎక్కువగా పోలింగ్‌ నమోదు చేశారు. ఈ పట్టుదల దేనికి సంకేతమన్న చర్చ సర్వత్రా మొదలైంది.


తుది సమాచారం ప్రకారం 8వ తేదీ నాటికి 4,32,222 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద బారులుదీరారు. కాగా, అనంతపురం అర్బన్‌లో అత్యధికంగా 5,478 ఓట్లు, మంత్రాలయం అసెంబ్లీ పరిధిలో అత్యల్పంగా 702 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 23,574 ఓట్లు, నర్సాపురం పార్లమెంటు స్థానంలో అత్యల్పంగా 13,177 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి.

Updated Date - May 10 , 2024 | 07:13 AM