Share News

బుడమేరుకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:38 AM

‘‘విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా బుడమేరు ఆక్రమణపై దృష్టి పెట్టాం. మరో పక్షం రోజుల్లో బుడమేరు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నాం. ‘హైడ్రా’ తరహా దూకుడు మాత్రం ఇక్కడ ఉండదు. మానవీయ కోణంలోనే ఆక్రమణలు తొలగిస్తాం. ప్రధానంగా పెద్ద పెద్ద ఆక్రమణదారులపైనే తమ చర్యలు ఉంటాయి’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) స్పష్టం చేశారు. నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్యకు ఫ్లై వోవర్లు, బైపాస్‌ రోడ్డుల నిర్మాణంతో చెక్‌ పెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో విజయవాడ పార్లమెంటు రూపురేఖలను మార్చే దిశగా కృషి చేస్తున్నానని వివరించారు. ఇంకా పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. - (విజయవాడ - ఆంధ్రజ్యోతి)

బుడమేరుకు శాశ్వత పరిష్కారం

15 రోజుల్లో బుడమేరు యాక్షన్‌ ప్లాన్‌ అమలు

ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం

పేద, మధ్యతరగతిపై ‘హైడ్రా’ తరహా దూకుడు ఉండదు

మానవీయకోణంలో ఆక్రమణల తొలగింపు

‘బడా’ ఆక్రమణలపైనే దృష్టి

ఫ్లైవోవర్లు, బైపాస్‌లతోనే ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

‘ఆంధ్రజ్యోతి’తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)

‘‘విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా బుడమేరు ఆక్రమణపై దృష్టి పెట్టాం. మరో పక్షం రోజుల్లో బుడమేరు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నాం. ‘హైడ్రా’ తరహా దూకుడు మాత్రం ఇక్కడ ఉండదు. మానవీయ కోణంలోనే ఆక్రమణలు తొలగిస్తాం. ప్రధానంగా పెద్ద పెద్ద ఆక్రమణదారులపైనే తమ చర్యలు ఉంటాయి’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) స్పష్టం చేశారు. నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్యకు ఫ్లై వోవర్లు, బైపాస్‌ రోడ్డుల నిర్మాణంతో చెక్‌ పెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో విజయవాడ పార్లమెంటు రూపురేఖలను మార్చే దిశగా కృషి చేస్తున్నానని వివరించారు. ఇంకా పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. - (విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఆక్రమణల వివరాలు సేకరించాం

బుడమేరు ఆక్రమణల తొలగింపుపై పక్షం రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌కు దిగుతాం. ఇప్పటికే ఆక్రమణలకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం పూర్తయింది. అయితే తెలంగాణలో హైడ్రా తరహాలో దూకుడు ప్రదర్శించబోం. ఏ విషయంలోనైనా మానవీయ కోణంలో వ్యవహరించండన్న మా అధినేత చంద్రబాబు సూచనల మేరకు చిన్న చిన్న ఆక్రమణదారుల విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళతాం. పెద్ద ఆక్రమణదారుల విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదు. నగరంలోని ప్రధాన డ్రెయిన్ల ఆక్రమణల తొలగింపుపై కూడా దృష్టి సారించనున్నాం. ముఖ్యంగా రైల్వే స్థలాల ఆక్రమణ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా వీఎంసీ, రైల్వే అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. వారి సూచనలతో ఆక్రమణల తొలగింపుపై ముందుకెళ్తాం. అలాగే స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనులను గతంలో టీడీపీ హయాంలో ప్రారంభిస్తే వైసీపీ హయాం లో అడ్డుకుని ఆపివేశారు. తిరిగి ఆ పనులను ప్రారంభిస్తాం. ఆ పనులు పూర్తయితే నగరంలో వరద నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

బెజవాడ ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యకు ఫ్లైవోవర్లు, బైపాస్‌ రోడ్డుల నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుంది. మహానాడు జంక్షన్‌ నుంచి నిడమనూరు రైల్వే బ్రిడ్జి వరకు 6.5 కిలోమీటర్ల మేర నిర్మించే ఫ్లైవోవర్‌ డీపీఆర్‌ సిద్ధం చేశాం. దీనికి రామవరప్పాడు వద్ద ఇన్‌ అండ్‌ ఔట్‌ ఎగ్జిట్‌ ఇస్తున్నారు. ఫ్లైవోవర్‌ డిజైన్లు కూడా రెడీ అయ్యాయి. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2025 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో ఫ్లైవోవర్‌ను పూర్తి చేస్తాం. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డుకు కూడా డీపీఆర్‌ పూర్తయింది. అలైన్‌మెంట్‌ డిజైన్‌ కూడా ఫైనల్‌ చేశాం. టెండర్లు పూర్తి చేసి 2025 మార్చికి పనులు ప్రారంభిస్తాం. రాజధాని అమరావతి తొలి దశ పనులు పూర్తయ్యే నాటికి తూర్పు బైపాస్‌ కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. మొత్తం మీద రెండేళ్లలో అటు ఫ్లైవోవర్‌ ఇటు తూర్పు బైపాస్‌ రెండూ పూర్తవుతాయి. ఇప్పటికే పశ్చిమ బైపాస్‌ పూర్తయ్యింది. మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. బెంజి సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా బందరు రోడ్డు విస్తరణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇవన్నీ పూర్తయితే విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుంది.

యువతకు ఉపాధి కల్పన దిశగా అడుగులు

రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ(మైక్రో, మీడియం, స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌)పాలసీపై దృష్టి పెట్టాం. ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను, నియోజకవర్గానికి ఓ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 29 నుంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ నగరంలో పేద, మధ్యతరగతి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను. ప్రతియేటా నా పార్లమెంటు పరిధిలో 10వేల మంది యువతకు ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం.

కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు కృష్ణాజలాలు

తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వారికి తాగునీటిని అందిస్తున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా కృష్ణా జలాలను కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే సురక్షితమైన తాగునీరు అందిస్తాం.

వేదాద్రి, చింతలపూడి ప్రాజెక్టుల పూర్తికి కృషి

విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజక వర్గాలతోపాటు నూజివీడు నియోజకవర్గ ప్రజల సాగునీటి సమస్యల పరిష్కారానికి వేదాద్రి, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాను. చింతలపూడి ప్రాజెక్టు పనులను 2025 మార్చి నాటికి ప్రారంభిస్తాం. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేదాద్రి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

120 రోజుల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 120 రోజులు దాటుతోంది. ఈ నాలుగు నెలల పాలన ఎన్నో సంతృప్తికరంగా ఉంది. విజయవాడ నగరాన్ని బుడమేరు వరదలు ముంచెత్తిన సమయంలో 12 రోజులపాటు సీఎం చంద్రబాబు బాధితులకు అండగా ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించిన తీరు మాలాంటి వారికి స్ఫూర్తిదాయకం. వరద బాధితులకు ఏం కావాలో వారి కన్నా ఎక్కువగా ఆలోచన చేసి వాటన్నింటినీ సమకూర్చిన ఘనత చంద్రబాబుదే. ఇళ్లను ఫైరింజన్లతో శుభ్రం చేయించడం వంటివన్నీ 74 ఏళ్ల యువకుడు చేసిన వినూత్న ఆలోచన. అలాంటి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా పింఛను రూ.4వేలుకు పెంచి బకాయిలతో సహా రూ.7వేలు తొలి నెలలో అందజేశాం. ఒకటో తేదీన రూ.7 వేలు అందుకున్న పింఛన్‌దారుల మొహాల్లో ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడేలా చూస్తున్నాం. అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాం. వాటిని గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించినా వాటి విలువను పేదలకు తెలిసేలా చేసిన ఘనత మాత్రం వైసీపీ వారిదే. వారు అధికారంలోకి రాగానే వాటిని మూసివేయబట్టే మేం పునఃప్రారంభించగానే పేదలు, మధ్యతరగతి నుంచి అన్న క్యాంటీన్లకు అనూహ్య స్పందన లభించింది. దీపావళి నుంచి మూడు సిలిండర్లు అందించనున్నాం. భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఇసుక అందజేస్తున్నాం. ఇవన్నీ 120 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం.

Updated Date - Oct 23 , 2024 | 01:38 AM