Share News

కుప్ప కూలిన వంతెన!

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:35 AM

ఈదులమద్దాలి శివారులోని చంద్రయ్య కాలువపై వంతెన గురువారం కూలిపోయింది. దీంతో పెదపారుపూడి నుంచి యలమర్రు మీదుగా విజయవాడ వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో వంతెనపై ఉన్న ట్రాక్టర్‌ ట్రక్కు అందులో ఇరుక్కుపోయింది.

కుప్ప కూలిన వంతెన!
చంద్రయ్య కాలువపై కూలిపోయిన వంతెన

పెదపారుపూడి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఈదులమద్దాలి శివారులోని చంద్రయ్య కాలువపై వంతెన గురువారం కూలిపోయింది. దీంతో పెదపారుపూడి నుంచి యలమర్రు మీదుగా విజయవాడ వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో వంతెనపై ఉన్న ట్రాక్టర్‌ ట్రక్కు అందులో ఇరుక్కుపోయింది. గత రెండేళ్లుగా వంతెన దుస్థితిపై ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించారని, కేవలం వారి నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి వచ్చిందని వాహనదారులు వాపోతున్నారు.

గుడివాడ-కంకిపాడు రహదారి అధ్వానంగా ఉండటంతో విజయవాడకు ప్రయాణికులు ఈ మార్గంలోనే వెళుతుంటారు. చుట్టుపక్కల సుమారు 10 గ్రామాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు ఈ మార్గం ద్వారానే గుడివాడకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. రైతులకు సైతం ప్రధాన రహదారిగా ఉంది. వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉండటంతో పలువురు రైతులు ఏడాది క్రితం నాలుగు చక్రాల వాహనాలు రాకుండా మట్టి దిబ్బలను పోసి ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా జాగ్రత్తలు చేపట్టారు. కాలక్రమేణా మట్టి కరిగిపోగా చివరకు వంతెన కూలిపోయింది. అధికారులు స్పందించి రాకపోకలకు మార్గం ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వంతెన కూలిన విషయాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీడీవో టి.సీతామహాలక్ష్మి తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే గతంలోనే ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లగా, రూ.1.50 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులు కూలిన వంతెనను పరిశీలించినట్టు ఆమె తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 01:35 AM