Share News

జడ్పీ సీఈవోపై వేటు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:42 AM

సొంత జిల్లాలో ఉంటూ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీ సీఈవో జ్యోతిబసుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పందించిన కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు.. చార్జి అప్పగించి సరెండ్‌ కావాలని ఆదేశించారు.

జడ్పీ సీఈవోపై వేటు

కలెక్టర్‌ను ప్రశ్నించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

చార్జి అప్పగించి జీఏడీకి సరెండ్‌ కావాలని కలెక్టర్‌ ఆదేశం

బాధ్యతల నుంచి రిలీవైన సీఈవో జ్యోతిబసు

అధికార పార్టీ పెద్దలతో సత్సంబంధాలు.. సహకారాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సొంత జిల్లాలో ఉంటూ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీ సీఈవో జ్యోతిబసుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పందించిన కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు.. చార్జి అప్పగించి సరెండ్‌ కావాలని ఆదేశించారు. దీంతో జ్యోతిబసు తన బాధ్యతల నుంచి రిలీవై జీఏడీకి సరెండ్‌ అయ్యారు. జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందరావుకు ఆయన బాధ్యతలను అదనంగా అప్పగించారు.

ఆది నుంచీ వివాదాస్పదుడే..

ఎన్నికల నేపథ్యంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు ఇక్కడే ఉండటానికి వీలుగా పావులు కదిపారు. ఇందుకోసం అధికార పార్టీ పెద్దలను ఆశ్రయించి కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల విధులు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి ఎన్నికల డ్యూటీ వేసినప్పటికీ తప్పించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఎన్నికల డ్యూటీ వేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానికంగా ఉంటూ కదలకపోవటంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో తన విషయంలో స్థానికత వర్తించదని జడ్పీ సీఈవో చెప్పుకొచ్చారు. సన్నిహితుల దగ్గర మాత్రం తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని, తననెవరూ కదల్చలేరన్నారు. ఈ క్రమంలో అసలు వాస్తవాలు ఏమిటన్న దానిపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. రెండు రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీసీలో జడ్పీ సీఈవోలు సొంత జిల్లాలోనే కొనసాగటంపై చర్చ జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పటంతో కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అధికార పార్టీకి వీర విధేయుడిగా ముద్రపడిన ఈ జడ్పీ సీఈవో తీరుపై విపక్షాలు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ తరఫున పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ భర్త అడుగులకు మడుగులొత్తారు. జడ్పీ ఉద్యోగులను ఆయన పార్టీ కార్యాలయంలో పనుల కోసం నియమించటం కూడా తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఒక్క పెడన నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులకు సహకరించేలా జడ్పీ సీఈవో జ్యోతిబసుకు అధికార పార్టీ పెద్దలు బాధ్యతలు అప్పగించారని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి.

Updated Date - Mar 22 , 2024 | 12:42 AM