Share News

డిజిటల్‌ అరెస్టు.. రూ.1.25 కోట్లు హాంఫట్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:29 AM

వందలు కాదు.. వేలు కాదు.. లక్షలు కూడా కాదు.. ఏకంగా రూ.కోటి 25 లక్షలకు సైబర్‌ మోసం డిజిటల్‌ అరెస్టులో చిక్కుకున్న ఓ మహిళ చివరికి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

డిజిటల్‌ అరెస్టు.. రూ.1.25 కోట్లు హాంఫట్‌

నగరంలో సైబర్‌ మోసంలో చిక్కుకున్న మహిళ

విజయవాడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వందలు కాదు.. వేలు కాదు.. లక్షలు కూడా కాదు.. ఏకంగా రూ.కోటి 25 లక్షలకు సైబర్‌ మోసం డిజిటల్‌ అరెస్టులో చిక్కుకున్న ఓ మహిళ చివరికి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. గురునానక్‌ కాలనీకి చెందిన ఈ మహిళ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కొద్దిరోజుల క్రితమే ఆమె నగరానికి వచ్చింది. శుక్రవారం ఉదయం ఆమెకు గుర్తుతెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ముందుగా అవతలి వ్యక్తి ఆమె ఆధార్‌ కార్డు నెంబరు చెప్పాడు. అది తనదేనని ఆమె బదులిచ్చింది. తర్వాత ఫోన్‌ నెంబర్‌ను నిర్ధారించుకుంది. అది కూడా తనదేనని ఆమె ఒప్పుకొంది. ఆ తర్వాత వీడియో కాల్‌ చేశాడు. దుబాయి నుంచి ముంబయికి ఆమె పేరిట ఓ పార్శిల్‌ వచ్చిందని, అందులో పాస్‌పోర్టులు, సిమ్‌కార్డులు, 180 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ ఉందని చెప్పాడు. దీనిపై కేసు నమోదైందని, విచారణకు ముంబయి రావాలన్నాడు. భయపడిపోయిన ఆమె శుక్రవారం ఉదయం 11 నుంచి వరుసగా వీడియోకాల్స్‌ వచ్చేసరికి నిజమేనని భావిం చింది. గాయత్రీ నగర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌కు వెళ్లి ఆర్టీజీఎస్‌ రూ.1.25 కోట్లను ఆన్‌లైన్‌లో అతడి అకౌంట్‌కు పంపింది. తర్వాత లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 16 , 2024 | 12:29 AM