తలసేమియా వ్యాధిపై అవగాహన
ABN , Publish Date - May 09 , 2024 | 12:32 AM
తలసేమియా వ్యాధితో శరీరం క్షీణిస్తుందని, హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉంటుందని, ఎముకల సాంద్రత తగ్గి బలహీనులవుతారని న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్మోహన్ తెలిపారు.
తలసేమియా వ్యాధిపై అవగాహన
వన్‌టౌన్, మే 8: తలసేమియా వ్యాధితో శరీరం క్షీణిస్తుందని, హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉంటుందని, ఎముకల సాంద్రత తగ్గి బలహీనులవుతారని న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్మోహన్ తెలిపారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, న్యూసిటీ బ్లడ్‌బ్యాంకుల ఆధ్వర్యంలో బుధవారం తలసేమియా వ్యాధిపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తలసేమియా వ్యాధి గురించి వివరించారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందని చెప్పారు. వ్యాధి నిర్థారించేందుకు ఉన్న టెస్టులను ఆయన వివరించారు. ఒక్క బ్లడ్ శాంపిల్తోనే ఈ టెస్టులన్నీ చేయవచ్చన్నారు. పౌష్టికాహార లోపంవల్ల, మేనరిక వివాహాలు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారని తెలిపారు. బాలసేవ పథకం కింద తలసేమియా రోగులకు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారు. పోలిక్‌యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తలసేమియా సంకేతాలను తగ్గించవచ్చునన్నారు. కాయ, ధాన్యాలు, గుడ్డు పచ్చసొన, ఎండిన బీన్స్, చిలగడదుంపలు, హోల్‌గ్రెయిన్ బ్రెడ్, సోయా ఉత్పత్తులు, స్పిట్ బఠానీలు, గింజలు, అరటిపండ్లు తదితరాలతో పాటు రోజూ రెండు గ్లాసుల పాలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చునన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పల్లా రవీంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.