కారుచౌకగా కొట్టేశారు!
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:47 AM
సుమారు రూ. 2 కోట్ల విలువైన ఆస్తిని కారుచౌకగా కొట్టేశారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ బ్యాంకు డైరెక్టర్లే బంధుగణాన్ని వేలంలో పాల్గొనేలా చేసి అతి తక్కువకు ఖరీదైన ఆస్తిని కాజేశారు. గాంధీ సహకార అర్బన్ బ్యాంకులో వాయిదాలు కట్టకుండా వేలానికి వచ్చిన ఆస్తిని బ్యాంకు డైరెక్టర్లే కుమ్మక్కయి కొట్టేయడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నా సహకార శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

గాంధీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ల మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. రుణ గ్రహీతల ఆస్తుల వేలంలో బ్యాంకు యాజమాన్యం అవినీతికి పాల్పడిన ఉదంతంపై సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బందరు రోడ్డులో తాజ్ వివంత హోటల్‌కు ఎదురుగా ఉన్న సుమారు 80 గజాల స్థలం, అందులోని 3 అంతస్థుల భవనం వేలానికి వచ్చింది. భవన యజమాని బి.రవిబాబు వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు సదరు ఆస్తిని వేలం వేసింది. ఆస్తి విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. అయితే వేలంలో కేవలం రూ.88 లక్షలకే ఆస్తిని చేజిక్కించుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బ్యాంకు డైరెక్టర్లు అంతా ఒక్కటై కేవలం రూ.88 లక్షలకే తమ వారికి అప్పజెప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి భర్త కూడా వేలంలో పాల్గొనడం గమనార్హం. ఇది బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఈ మొత్తం ఉదంతంలో బ్యాంకు సేల్ ఆఫీసర్ పాత్ర వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు అనుగుణంగా ఎవరు వేలంపాటలో పాల్గొంటున్నారు.. ఆస్తి మార్కెట్ ధర ఎంత.. ఎంత వరకు వేలంలో ధర రావచ్చు అన్న అంశాలను పర్యవేక్షించాల్సిన ఈయన బ్యాంకు డైరెక్టర్లకు కొమ్ముకాసేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సహకార శాఖ నుంచి డిప్యుటేషన్‌పై బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఈయన గత పదేళ్లుగా అదే పోస్టులో ఉండటం గమనార్హం. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు సేల్ ఆఫీసర్‌ను మార్చాల్సి ఉన్నా ఇక్కడ అది జరగలేదు. ఈ ఆస్తి వేలంపై ఆస్తి యజమాని సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.2 కోట్లు విలువైన ఆస్తిని కారుచౌకగా వేలం వేసి తనకు నష్టం కలిగించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే వేలాన్ని రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలని ఆయన కోరుతున్నారు. సహకార శాఖ అఽధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆస్తి యజమాని, బ్యాంకు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.