Share News

భక్తజన కీలాద్రి

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:22 AM

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం కావటంతో దుర్గా మల్లేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తజన కీలాద్రి
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

వన్‌టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం కావటంతో దుర్గా మల్లేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చండీహోమం, శ్రీచక్ర నవావరణార్చన, లక్ష కుంకుమార్చన, ఖడ్గమాల, శాంతి కళ్యాణం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఈవో రామారావు ఆదేశాల మేరకు అధికారులు భక్తుల శీఘ్ర దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

దుర్గమ్మ సేవలో గరికపాటి నరసింహారావు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆదివారం ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఆయనకు ఈవో రామారావు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.

అన్నవితరణకు విరాళం

హైదరాబాద్‌ కూకట్‌పల్లి సాయిబాబానగర్‌కు చెందిన మోటుపల్లి సురేశ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దుర్గమ్మను దర్శించుకుని అన్నవితరణ నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో అధికారులకు అందజేశారు.

అమ్మవారికి కాసులపేరు కానుక

విజయవాడ గొల్లపూడి నివాసి ఎ.సూరిబాబు కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి అలంకరణ నిమిత్తం 65 గ్రాముల బంగారు కాసుల పేరు కానుకగా అందజేశారు.

అఖండ ధ్యాన యజ్ఞం

దుర్గగుడిలో ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు అఖండ ధ్యానయజ్ఞ కార్యక్రమం జరిగింది. ధ్యాన యజ్ఞంలో పలువురు మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

సూర్యోపాసన సేవ

లోకక్షేమం కోరుతూ సకల జనుల ఆయురారోగ్యాలను కాపాడలంటూ సంకల్పం చెప్పి దేవస్థానం అర్చకులు, వేదపండితులు ఆదివారం సూర్యోపాసన సేవ చేశారు. సూర్యనారాయణమూర్తికి అర్చనలు చేశారు. మంత్రపుష్పం, హారతులు సమర్పించి భక్తజనులకు ఆశీస్సులు అందజేశారు.

Updated Date - Nov 18 , 2024 | 12:22 AM