CM Chandrababu: సరికొత్త చరిత్రకు నాంది
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:04 PM
Andhrapradesh: ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని.. నేడు పనిచేస్తుంటే తెలుస్తోందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే.. అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు.
అమరావతి, డిసెంబర్ 13: స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM chandrababu Niaud) అన్నారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ - 2047ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని.. నేడు పనిచేస్తుంటే తెలుస్తోందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే.. అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు.
Pawankalyan: బాబును ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే
వాటి ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు..
తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నేడు 3 వేల డాలర్లకంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి 42 వేల డాలర్లకు పెరగాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణలు ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని సీఎం వెల్లడించారు.
అది మంత్రంగా తయారు కావాలి..
అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీ4 విధానంలో) పేదరిక నిర్మూలన చేయాలన్నారు. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతీ ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యారన్నారు. విజన్ 2047లో భాగంగా ఇప్పుడు ప్రతీ ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రమన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చు తగ్గులను సమన్వయం చేయటాన్ని ఉద్యమంగా చేపట్టాలన్నారు. నైపుణ శిక్షణ ఇప్పించి, మానవవనరుల అభివృద్ధి చేయటం మూడో సూత్రంలో ప్రధానమన్నారు. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తూ... నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే నాలుగో సూత్రంతో కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి సాంకేతికత పెంచి, గౌరవంగా జీవించేలా చేసేందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తూ ఆరో సత్రంగా విజన్‌లో చేర్చామన్నారు
10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం రూ.16.41 లక్షల కోట్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జీడీపీని 2047 నాటికి 2 కోట్ల కోట్లుకు తీసుకెళ్లటమే విజన్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రతి ఏటా ఆర్థిక వృద్ధి లక్ష్యం 15 శాతమని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తిదాయక విధానాలతో ముందుకెళ్తున్నామని.. అన్ని ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. వస్తు రవాణ ఖర్చులు 4 శాతం నుంచి 8 శాతానికి తగ్గించేలా అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్స్ తీసుకురావటం ఆరో సూత్రం లక్ష్యమన్నారు. ఇంధన వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీని తయారు చేయటం ఏడో సూత్రంలో భాగమన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే ఈ రంగం లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించి గ్లోబల్ బ్రాండ్ సృష్టించి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తామన్నారు. మానసిక ఉల్లాసం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమన్నారు. శాటిలైట్, డ్రోన్, సీసీటీవీ, ఐఓటీ ద్వారా రియల్‌టైమ్ డేటాను సద్వినియోగం చేసకుంటూ స్మార్ట్ వర్క్ చేయటమే పదో సూత్రం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!
జగన్ అక్రమాస్తుల కేసు... తాజా అప్‌డేట్ ఇదే
Read Latest AP News And Telugu News