Share News

శాంతిమార్గంలో..

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:50 AM

క్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ శాంతిమార్గాన్ని అనుసరిద్దామని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రీ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌-2024 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

శాంతిమార్గంలో..
క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు

ప్రేమ, కరుణ, సేవతత్వాలను పెంచుకోవాలి

ప్రీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు వెల్లడి

కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తుకు ఘన నివాళి

క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రేమ విందు స్వీకరణ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : క్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ శాంతిమార్గాన్ని అనుసరిద్దామని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రీ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌-2024 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈర్ష్యా ద్వేషాలను వీడాలని కోరారు. అబద్ధం, అవినీతి వంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘భగవంతుడు నిన్ను ఎప్పుడూ ఖాళీగా వదిలిపెట్టడు. నీవు కోల్పోయిన ప్రతి ఒక్కదానినీ తిరిగి నీకిస్తాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పుడు నిన్ను మళ్లీ పైకి తీసుకొచ్చేందుకు సహాయం అందిస్తాడు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల పట్ల దయ, ధర్మాన్ని నమ్మిన వారికి దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడన్నారు.

సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి

స్వాతంత్య్రం రాకముందు నుంచి క్రైస్తవ మిషనరీ సంస్థలు కాలేజీలు, హాస్పిటళ్లు కట్టి పేదలకు సేవ చేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చింది ఏసు ప్రభువేనన్నారు. లోకరక్షకుడైన ప్రభువు కరుణ, కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మైనారిటీ సోదరులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, చెడు మళ్లీ జరక్కుండా చర్యలు తీసుకుంటున్నానన్నారు. పేదరికం లేని సమాజం కోసం తాను ఆలోచనలు చేస్తున్నానని, విజన్‌- 2047లో నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యమిదేనన్నారు. క్రైస్తవులకు మెరుగైన సంక్షేమం, ఆర్థిక సహాయ సహకారాలు అందించింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ సీఎం క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్‌ కేకును కట్‌చేసి క్రైస్తవ మత పెద్దలకు తినిపించారు. క్రైస్తవ మతపెద్దలు కూడా చంద్రబాబుకు కేకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ప్రేమ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:50 AM