ఎమ్మెల్సీ ఓటు నమోదులో గందరగోళం
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:03 AM
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు అపహాస్యంగా మారింది. పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎన్నికల యంత్రాంగం సరైన ప్రచారం కల్పించకపోవటం ఒక సమస్య అయితే, కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రచారం ద్వారా మాత్రమే చాలామంది పట్టభద్రులు ఆలస్యంగా ఓటుహక్కు నమోదు విషయాన్ని తెలుసుకోవడం మరో సమస్య. అయితే, అప్పటికే సమయం మించిపోయింది.
ఈనెల 6వ తేదీకే పూర్తయిన గడువు
తాజాగా ఓటీపీలు చెప్పాలంటూ ఫోన్లు
గడువు పెంచారో లేదో తెలియని తికమక
గతంతో సర్వర్ సమస్యతో రిజిస్టర్ కాని దరఖాస్తులెన్నో..
ఆందోళనలో పట్టభద్రులు.. గడువు పెంచాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు అపహాస్యంగా మారింది. పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎన్నికల యంత్రాంగం సరైన ప్రచారం కల్పించకపోవటం ఒక సమస్య అయితే, కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రచారం ద్వారా మాత్రమే చాలామంది పట్టభద్రులు ఆలస్యంగా ఓటుహక్కు నమోదు విషయాన్ని తెలుసుకోవడం మరో సమస్య. అయితే, అప్పటికే సమయం మించిపోయింది.
సర్వర్ సమస్యతో..
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వంద ల సంఖ్యలో పట్టభద్రులు ఓటుహక్కు కోసం రిజిస్ర్టేషన్ చేసుకోలేకపోయారు. తుది గడువు ఈనెల 6నే ముగియగా, 4, 5, 6 తేదీల్లో ఆన్‌లైన్ పోర్టర్ సర్వర్ పనిచేయలేదు. దీంతో ఆన్‌లైన్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, ఏపీఎన్జీజీవో సంఘం, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ఉండిపోయాయి. సర్వర్ పనిచేసినపుడు కొన్నింటికి మాత్రమే రిజిస్టర్ చేశారు. సమయం ముగియడంతో మిగిలిన వాటిని రిజిస్టర్ చేయలేకపోయారు. విజయవాడ నగరంలో ఏపీఎన్జీజీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటు నమోదు చేపట్టినా, సర్వర్ సమస్య కారణంగా పూర్తిగా రిజిస్ర్టేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. చాలా దరఖాస్తులను ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఏర్పాటు చేయించిన కార్యాలయానికి పంపించి, అక్కడి నుంచి ఓటు నమోదు చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు.
గడువు పెంచారా..?
ఎమ్మెల్సీ అశోక్‌బాబు కార్యాలయం వద్ద ఓటు నమోదు చేయించుకున్న చాలామందికి శనివారం ఓటీపీ చెప్పమని ఫోన్లు వచ్చాయి. దీంతో గందరగోళం నెలకొంది. గడువు ముగిశాక ఓట్ల నమోదుకు ఎలా అవ కాశం ఉంటుందని చాలామంది ప్రశ్నించారు. అలాగే, ఏపీఎన్జీవో కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తే, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆఫీసుకు ఎందుకు వెళ్లాయో తెలియక పట్టభద్రులు గందరగోళానికి గురయ్యారు. చాలామంది ఓటీపీ చెప్పలేదు. గడువు ముగిసినా సైట్ ఓపెన్ అయ్యిందని, అందుకే పెండింగ్‌లో ఉన్న వాటిని రిజిస్టర్ చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అయితే, అధికారికంగా గడువు పెంచకపోవటం వల్ల తాజా రిజిసే్ట్రషన్ల వల్ల ఓటుహక్కు వస్తుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది. ఈనెల 6వ తేదీలోపు మాన్యువల్‌గా ఇచ్చిన వారికే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
గడువు పెంచుతారా?
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదుకు మరో పక్షం రోజులు గడువు పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. అలాగే, పట్టభద్ర ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ప్రావిజినల్ సర్టిఫికెట్‌పై గజిటెడ్ అధికారి సంతకాన్ని తప్పనిసరి చేసింది. అది ఒరిజినలో కాదో తెలుసుకోవటానికి ధ్రువీకరణ పత్రాల యాక్సెస్‌ను తీసుకుంటే సరిపోతుంది. గజిటెడ్ ఆఫీసర్ల చుట్టూ తిరగడం ఇబ్బందిగా ఉందని కొందరు పేర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమవద్దే గజిటెడ్ అధికారులను ఏర్పాటు చేసుకున్నాయి.