Share News

అనుభవించు రాజా

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:08 AM

పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు ఆయనొక ఇల్లరికపు అల్లుడు. రిటైర్‌ అయిన ఉద్యోగే.. అయినా అతిథ్యానికి అలవాటుపడి బెర్మ్‌ పార్కులో తిష్ట వేశాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంచక్కా కాటేజీతో పాటు ఫలహారం, ఆహారం, స్నాక్స్‌, కాఫీల పేరిట రాచభోగాలు అనుభవిస్తున్నాడు. ఏడాదిన్నరగా పర్యాటక కాటేజీలోనే తిష్టవేసిన ఈ అధికారి కారణంగా ఏపీటీడీసీ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ఏపీటీడీసీ ఉన్నతాధి కారికి ఇష్టుడైన ఈ అధికారి ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట..

అనుభవించు రాజా

ఏడాదిన్నరగా ఇక్కడే తిష్ట

కాఫీ, టిఫిన్‌, స్నాక్స్‌, లంచ్‌, డిన్నర్‌ అన్నీ ఇక్కడే..

పదవీ విరమణ చెందిన వ్యక్తికి వాటర్‌ ఫ్లీట్‌ బాధ్యతలు

భారీగా నష్టపోతున్న ఏపీటీడీసీ

ఏసీ సూట్‌లో ఆతిథ్యం, డన్‌లప్‌ పరుపుపై శయనం, లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అన్నీ అక్కడే. వాకింగ్‌కు వచ్చినప్పుడల్లా కాఫీ తప్పనిసరి. కోరినపుడు స్నాక్స్‌, సాఫ్ట్‌డ్రింక్స్‌.. ఒక్కటేమిటి అతిథి మర్యాదలన్నీ ఆయనకే. ఇదే సూట్‌ పర్యాటకులు బుక్‌ చేసుకుంటే ఏపీటీడీసీకి రోజుకు రూ.2,500 నుంచి రూ.3 వేల ఆదాయం వస్తుంది. మొత్తంగా నెలకు అక్షరాలా రూ.లక్ష ఆదాయం వస్తుంది. కానీ, సదరు అధికారి చెల్లించే మొత్తం మాత్రం రూ.5 వేలు. ఏడాదిన్నరగా ఆయన వల్ల రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఏపీటీడీసీ ఆదాయాన్ని కోల్పోయింది.

ఇష్టానుసారంగా బోట్ల కొనుగోలు

ఏపీటీడీసీకి ఇల్లరికపు అల్లుడిగా వచ్చిన ఈ అధికారి బోటింగ్‌ విభాగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇటీవల ఉత్తర భారతదేశం నుంచి సెకండ్‌ హ్యాండ్‌ బోట్లను రహస్యంగా కొనుగోలు చేయటంలో ఈ అధికారి పాత్రే ప్రధానంగా ఉంది. సముద్రంలో ఓడలకు కట్టే బోట్లను రెండింటిని కొన్నారు. వాటిని ఇక్కడ స్పీడ్‌ బోట్లుగా తిప్పుతారని చెబుతున్నారు. పోర్టు ఎన్‌వోసీలు, ఇరిగేషన్‌ శాఖ అనుమతులు లేకుండా బోట్లను నడిపిస్తున్న ఈ వాటర్‌ ఫ్లీట్‌ బాస్‌ పర్యాటకుల ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నాడు. తన అడుగులకు మడుగులొత్తే వారికి ఏపీటీడీసీలో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు. పదవీ విరమణ చెందిన వారికి కూడా రీ అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాడు. ఇలా పోస్టింగ్‌లు తెచ్చుకున్న వారంతా గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నవారే.

చర్యలు లేవా?

ఏపీటీడీసీలో సదరు అధికారితో పాటు ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తిష్టవేసిన వారున్నారు. తిరిగి వెళ్లటానికి ససేమిరా అంటున్నారు. కన్సల్టెంట్ల ముసుగులో లక్షలాది రూపాయలు ఏపీటీడీసీ నుంచి అప్పనంగా తింటున్నారు. ఇలాంటి వారందరినీ కూర్చోబెట్టి మేపుతుండటంతో సంస్థకు అంతులేని భారమవుతోంది.

Updated Date - Mar 09 , 2024 | 01:08 AM