Share News

దర్యాప్తునకు సహకరించండి

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:53 AM

హత్యా యత్నం కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత గౌతంరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

దర్యాప్తునకు సహకరించండి

వైసీపీ నేత గౌతంరెడ్డికి హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ వరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దు

పోలీసులకు స్పష్టీకరణ..ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 21కి వాయిదా

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): హత్యా యత్నం కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత గౌతంరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు గౌతంరెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ముందస్తు బెయిల్‌ పిటి షన్‌పై విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించడమే కాకుండా, తనను చంపేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ నేత గౌతం రెడ్డిపై విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సత్యనారాయణ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గౌతం రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా గౌతంరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయ వాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. భూమి సరిహద్దు విషయంలో పిటిషనర్‌, ఫిర్యాదుదారు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉందన్నారు. పిటిషనర్‌ డ్రైవర్‌, అతని అనుచరులు బెదిరించారని కేసు పెట్టారన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో గౌతంరెడ్డి లేరన్నారు. అసి స్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) వాదనలు విని పిస్తూ... ఈ పిటిషన్‌పై అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) వాదనలు వినిపిస్తారన్నారు. అందుకోసం విచారణను నేటికి (మంగళవారం) వాయిదా వేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. విచారణను వాయిదా వేశారు.

Updated Date - Nov 19 , 2024 | 01:53 AM