Share News

షరా‘మామూళ్లే..!’

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:01 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో పాలన గాడితప్పింది. ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరిస్తూ ఖర్చుల పేరుతో ప్రతి పనికీ రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, ఇతరత్రా పత్రాల మంజూరులో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓ అధికారి.. దరఖాస్తుల్లోని నెంబర్లకు ఫోన్‌చేసి నేరుగా బేరాలకు దిగుతుండటం, రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ బేరాల ప్రక్రియ ప్రారంభంకావడం ఇక్కడికొస్తున్న ప్రజలకు షరామామూలే.

షరా‘మామూళ్లే..!’
మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయం

  • మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రతి పనికీ రేటు

  • బహిరంగంగా బేరాలు.. ముక్కుపిండి వసూలు

  • దరఖాస్తుల్లోని నెంబర్లకు ఫోన్‌చేసి మరీ డిమాండ్‌

  • సాయంత్రం 6 తర్వాత బేరాల ప్రక్రియ మొదలు

  • ఎన్నికల సంఘం నిధులు పక్కదారి

  • ప్రజలే ఫిర్యాదులు చేస్తున్నా మారని పరిస్థితి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

  • ఇటీవల ఓ వ్యక్తి కారుణ్య నియామకం, ఇతరత్రా అవసరాల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంకేముంది సదరు వ్యక్తికి ఉద్యోగం వస్తే నెలకు ఎంత జీతం వస్తుంది?, ఇతరత్రా రూపంలో కలిగే ప్రయోజనాలు ఏమిటి? వంటి విషయాలను మచిలీపట్నంలోని తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు ఆరాతీసి లెక్కలు వేశారు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం రూ.లక్షలు డిమాండ్‌ చేశారు. అడిగినంత సొమ్ము ఇవ్వలేక సదరు వ్యక్తి నేరుగా రాష్ట్ర రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో పనితీరు మార్చుకోవాలని రెవెన్యూ మంత్రి కార్యాలయం నుంచి ఇక్కడి అధికారులకు అక్షింతలు కూడా పడ్డాయి.

  • చిన్నాపురం గ్రామ సమీపంలోని తన భూమి రెవెన్యూ రికార్డుల్లో తక్కువగా నమోదైందని, దీనిని మార్పు చేయాలని సంబంధిత వీఆర్వో వద్దకు ఓ రైతు వెళ్లగా, రూ.30 వేలు ఇస్తే పని అవుతుందని, కింది నుంచి పైస్థాయి వరకు నగదు ఇచ్చుకుంటూ వెళ్లాలని సదరు వీఆర్వో బహిరంగంగా బేరాలకు దిగాడు. అంత సొమ్ము ఇవ్వలేనని, సరిచేసినప్పుడే చేయండని సదరు రైతు రెవెన్యూ సిబ్బందికి దండంపెట్టి వెళ్లిపోయాడు.

  • మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో 202 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత లెవల్‌ అధికారులు పోలింగ్‌ బూతల వద్ద విధులు నిర్వహించినందుకు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.6 వేలను అందజేస్తారు. ఇందుకోసం ఏడాదికి రూ.12.12 లక్షలు విడుదలవుతాయి. ఈ నగదును బీఎల్వోలకు ఇవ్వకుండా కొంతకాలంగా తహసీల్దార్‌ కార్యాలయ అధికారులే తొక్కిపెట్టారు. తమ గౌరవ వేతనం ఇవ్వాలని బీఎల్వోలు అడగ్గా, ముందు మీరు పనిచేయండని చెప్పి, అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో భాగంగా సిబ్బందికి గౌరవ వేతనం, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండో విడతగా రూ.1.50 కోట్లను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కానీ, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్‌బూతల వద్ద ఖర్చులను వీఆర్వోలకు కూడా ఇవ్వలేదు.

ఇద్దరు తహసీల్దార్లకు బదులు ఒక్కరే..

ఈ తహసీల్టార్‌ కార్యాలయాన్ని సౌత, నార్త్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాలుగా విభజించారు. సౌత మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని వేరేచోటకు మార్చాల్సి ఉన్నా మార్చలేదు. రెండు తహసీల్దార్‌ కార్యాలయాలను పాత భవనంలోనే నిర్వహిస్తున్నారు. నార్త్‌ మండల తహసీల్దార్‌ గత నెలలో పదవీ విరమణ చేయడంతో, సౌత మండల తహసీల్దార్‌, నార్త్‌ మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇద్దరు రెవెన్యూ అధికారులు తమదైనశైలిలో ఈ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత మండల ఆర్‌ఐ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ తాను చెప్పినంత నగదు ఇస్తేనే పనులు జరుగుతాయని చెబుతున్నాడు. గతంలో ఇక్కడే సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఈ ఆర్‌ఐ.. వీఆర్‌ఏల జీతాల చెల్లింపు సమయంలో నెలనెలా నగదు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సరిచేస్తాం..

తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న తప్పులపై విచారణ చేసి సరిదిద్దుతాం. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు అవకాశం లేదు. సిబ్బందితో సమావేశం నిర్వహించి, పరిస్థితిని చక్కదిద్ది, పాలనను గాడిలో పెడతాం. బీఎల్వోలకు సంబంధించి నగదు ఇంకా విడుదల కాలేదు. సాధారణ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నగదు విడుదలైంది.

- మధుసూదనరావు, తహసీల్దార్‌, మచిలీపట్నం

Updated Date - Nov 17 , 2024 | 01:01 AM