Share News

అభివృద్ధి దారిలో..

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:48 AM

నాడు : అక్టోబరు 14న కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ సమయంలో కంకిపాడు- రొయ్యూరు వయా గొడవర్రు రహదారి పరిస్థితి దయనీయంగా ఉందంటూ స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అక్కడి నుంచే అభివృద్ధి పనులు చేపట్టా లంటూ సంబంధిత అధికారులను ఆరోజే ఆదేశించారు. నేడు : కేవలం ఆదేశాలు జారీచేసి ఊరుకోలేదు. పనుల పురోగతి పరిశీలించేందుకు రెండు నెలల వ్యవధిలో సోమవారం మళ్లీ కంకిపాడుకు పవన్‌ కల్యాణ్‌ రావడంపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం పరిశీలనతోనే సరిపెట్టక.. గోసాల గ్రామ పరిధిలో రహదారి ఎన్ని మీటర్ల వెడల్పు ఉండాలి, ఎన్ని అంగుళాలు ఎత్తు ఉండాలన్నది పవన్‌ నేరుగా టేపుతో కొలిచి కొలతలు వేశారు. కాల్వలో పెట్టిన పైపులు ఎన్ని అంగుళాలు ఉన్నాయంటూ కాల్వలో చెయ్యి పెట్టి మరీ కొలిచిన తీరును స్థానికులు ప్రశంసిస్తున్నారు.

అభివృద్ధి దారిలో..
కంకిపాడులో రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. చిత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ తదితరులు

కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్‌ తీరుపై హర్షం

అక్టోబరు 14న పల్లె పండుగకు హాజరు

కంకిపాడు-రొయ్యూరు రహదారి పనులకు ఆదేశాలు

అక్కడితో వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఆరా

రెండు నెలల్లో మళ్లీ అభివృద్ధి పనుల పరిశీలన

తాజాగా సంక్రాంతికి పూర్తికావాలని ఆదేశాలు

కంకిపాడు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కంకిపాడు-రొయ్యూరు వయా గొడవర్రు రహదారి అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామంలో రూ.3.75 కోట్లతో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను, పెనమలూరు మండలం గోసాల గ్రామ పరిధిలో రూ.33 లక్షలతో చేపట్టిన రహదారి, డ్రెయినేజీ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన గొడవర్రుకు చేరుకున్న ఆయన రహదారి నాణ్యతను పరిశీలించారు. రహదారి ఎప్పటికి పూర్తవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోసాల గ్రామ పరిధిలో రూ.33 లక్షలతో చేపట్టిన రహదారి, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ముప్పా రాజా, టీడీపీ గ్రామ అధ్యక్షుడు సుబానీ, స్థానిక టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పులి శ్రీనివాసరావు, ఎందువ రాంబాబు, ఏనుగ జయప్రకాష్‌, వంగూరు పవన్‌ పాల్గొన్నారు. గొడవర్రు గ్రామంలో జరిగిన పవన్‌ పర్యటనలో కేటుగాళ్లు చేతివాటం చూపించారు. కంకిపాడుకు చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి పవన్‌ను కలిసేందుకు రాగా, ఆయన జేబులో ఉన్న సుమారు రూ.18 వేలు దొంగతనానికి గురయ్యాయి. అలాగే, ఓ రిపోర్టర్‌ జేబులోని సుమారు రూ.3 వేలతో పాటు మరో రిపోర్టర్‌ మనీపర్సు కూడా మాయమైంది.

Updated Date - Dec 24 , 2024 | 12:48 AM