నెల నిండకుండానే స్థానచలనం
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:36 AM
ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో వచ్చిన అధికారులు కుదురుకునేలోపే స్థాన చలనాలు కలుగుతున్నాయి. విజయవాడ డీసీపీగా ఉన్న కృష్ణకాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించి ఇంకా నెల రోజులు నిండకుండానే బదిలీ అయ్యారు. ప్రభుత్వం తాజాగా నలుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది.
సిటీ డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ బదిలీ
కొత్తగా అధిరాజ్ సింగ్ రాణా రాక
విజయవాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో వచ్చిన అధికారులు కుదురుకునేలోపే స్థాన చలనాలు కలుగుతున్నాయి. విజయవాడ డీసీపీగా ఉన్న కృష్ణకాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించి ఇంకా నెల రోజులు నిండకుండానే బదిలీ అయ్యారు. ప్రభుత్వం తాజాగా నలుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఇక్కడ ఉన్న కృష్ణకాంత్ పాటిల్‌ను తిరుపతి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయనగరం ఐదో బెటాలియన్ కమాండెంట్ అధిరాజ్ సింగ్ రాణాను నియమించారు. తొలి విడతలో జరిగిన బదిలీల్లో విజయవాడ డీసీపీగా ఆనంద్‌రెడ్డిని నియమించారు. తర్వాత విడుదలైన జాబితాలో ఆయన బదిలీ ఇంటెలిజెన్స్‌కు మారిపోయింది. తర్వాత కృష్ణకాంత్ పాటిల్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఆయన గడచిన నెల ఐదో తేదీన బాధ్యతలు స్వీకరించారు. నగరం మీద ఒక అవగాహనకు వచ్చి పాలనను ట్రాక్‌లో పెడుతున్న తరుణంలో ప్రభుత్వం బదిలీ చేసింది.