వరద సాయంపై అపోహలు వద్దు
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:50 AM
విజయవాడలో వరదలకు దెబ్బతిన్న ప్రతి బాధితుడికి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పరిహారం అందించిందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు.

ఇంకా ఎవరికైనా అందకపోతే అధికారుల దృష్టికి తేవచ్చు
ఇందుకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు : సిసోడియా
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో వరదలకు దెబ్బతిన్న ప్రతి బాధితుడికి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పరిహారం అందించిందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద బాధితులు తమకు న్యాయంగా అందాల్సిన పరిహారం పొందటానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు పరిహారం అందజేసి, అండగా నిలిచిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో, బాధితుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించారు. ఏ ఒక్క బాధితుడికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని అధికారులను ఆదేశించారు. ఆ నేపథ్యంలో బాధితులందరికీ పరిహారం అందజేశాం. ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఈ విషయంలో అపోహలు విడనాడాలి. వరదల్లో నష్టపోయిన బాధితుల వివరాలన్నీ అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాం. వారికి పరిహారం అందజేశాం. మొత్తం రూ.238.38 కోట్లు 1,46,318 మంది బాధితుల ఖాతాలకు నేరుగా జమ చేశాం. ఇప్పటికీ పరిహారం అందకుంటే వారు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశముంది. నష్టం అంచనా వేసే సమయంలో ఇంట్లో లేని బాధితుల ఫిర్యాదుల నమోదుకు సీఎం ఆదేశాల మేరకు మరోసారి అవకాశం కల్పించాం. బాధితులు తమ పేర్లు నమోదు చేసుకోవటానికి ‘ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక’ ఏర్పాటు చేశామని తెలిపారు. కొంతమంది వరదసాయంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.