డ్రోన్ సిటీ
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:37 AM
ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక డ్రోన్ కేటాయించాలని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అవసరమైన డ్రోన్లను సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌కు మొత్తం మూడు డ్రోన్లు ఉండగా, తాజాగా పది కొత్తవి వచ్చాయి. త్వరలో మరిన్ని తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నగరానికి కొత్త డ్రోన్లు వచ్చాయ్
త్వరలో మరిన్ని రాక
ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒకటి చొప్పున..
ఇక అనుమానితుల కదలికలపై డ్రోన్ నిఘా
మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ
సచివాలయ పోలీసు సిబ్బందికి కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీసు స్టేషన్లు ఉండగా, అందులో నగరంలోనే 13 ఉన్నాయి. మిగిలిన 15 రూరల్ పరిధిలోకి వెళ్తాయి. మైలవరం సర్కిల్‌లో మూడు, తిరువూరు సర్కిల్‌లో నాలుగు, నందిగామ సర్కిల్‌లో నాలుగు ఉండగా, జగ్గయ్యపేట సర్కిల్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇలా మొత్తం అన్ని పోలీస్‌స్టేషన్లకు ఒక్కో డ్రోన్‌ను సమకూర్చే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వాటిని ఆపరేట్ చేయడానికి మహిళా పోలీసులతో పాటు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్‌కు శిక్షణ పూర్తికావచ్చింది. వారిని డ్రోన్ పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మహిళా పోలీసులు డ్రోన్లను ఎలా ఆపరేట్ చేస్తున్నారో కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమీ షాలి, టి.తిరుమలేశ్వరరెడ్డి గురువారం పరిశీలించారు. పోలీసు శాఖలో మహిళా పోలీసులకు కొన్ని పరిమితులుంటాయి. వారిని కొన్ని విధుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు వారిని డ్రోన్ ఆపరేషన్‌కు కేటాయించడం ద్వారా పోలీసు స్టేషన్ నుంచే వివిధ ప్రాంతాల్లో నిఘా కొనసాగించవచ్చన్న భావనలో అధికారులున్నారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌ను రాష్ట్రంలోనే తొలి డ్రోన్ కమిషనరేట్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా పోలీసులకు డ్రోన్ల సాంకేతిక అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. అనుమానిత వ్యక్తులను గానీ, వాహనాలను గానీ ట్రాక్ చేయాలనుకున్నప్పుడు ఈ టార్గెట్‌ను ఫిక్స్ చేస్తారు. ఈ టార్గెట్‌ను ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి.. అనే విషయాలపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తున్నారు. ఉదాహరణకు నగరంలోని పోలీసు కంట్రోల్‌రూమ్ కూడలి నుంచి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కదులుతున్నప్పుడు అతడి వెనుక వైపున డ్రోన్ ఎగురవేస్తారు. రిమోట్‌లో అతడు వెళ్తున్న వాహనం మార్గాన్ని డ్రాగ్ చేస్తారు. దీంతో డ్రోన్ ఆ వాహనం వెనుక కదులుతుంది. ఇలా కిలోమీటరు వరకు వెళ్తుంది. డ్రోన్ ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్ ఆ వాహనం వెనుక వెళ్తూ ఉంటే అది వేగంగా కదులుతుంది. దీంతోపాటు డ్రోన్ ఏయే కోణాల్లో ఎగరాలి, ఏయే మార్గాల్లో వెళ్లాలి.. అనే అంశానికి పాయింట్ ఆఫ్ వేస్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని రిమోట్‌లో స్ర్కీన్ ఎంపిక చేసుకుని డ్రోన్ ఏయే మూలలకు వెళ్లాలో పాయింట్లను ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత డ్రోన్ గాల్లోకి ఎగరగానే ఆయా పాయింట్లలో దానికదే వెళ్తుంది. దీనివల్ల ఆపరేటర్ రిమోట్ స్ర్కీన్‌పై కనిపిస్తున్న దృశ్యాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. డ్రోన్‌కు సంబంధించి సాంకేతికంగా ముడిపడి ఉన్న అన్ని అంశాలపైనా మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి పరీక్ష పెడతారు. ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.
ట్రైనింగ్ టార్గెట్
డ్రోన్ గాల్లోకి ఎగిరాక రిమోట్‌కు పని చెప్పకుండా కదలాలంటే ఏం చేయాలి.. ఇలా అనేక కొత్త అంశాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం బందరు రోడ్డులోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మహిళా పోలీసులకు, సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. వాళ్లందరికీ డ్రోన్లపై ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.