అంతా బూడిదే!
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:23 AM
దేశానికే వెలుగునిచ్చే కేంద్రంగా ఎన్టీటీపీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత వైసీపీ ఐదేళ్ల పాపాలు ఆ ప్లాంటు ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. నేతల ధనదాహం, అధికారుల అలసత్వంతో వెలుగునిచ్చే కేంద్రం కాస్త బూడిద కాలుష్యం వెదజల్లే కేంద్రంగా మారిపోయింది. వైసీపీ అతినీతిని తమకు అంటించుకొని సంస్థ ఉద్యోగులు సైతం బూడిద వ్యాపారులుగా తయారయ్యారు. ఫలితంగా ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద కాలుష్యంతో కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టు పక్కల ఉన్న శాంతినగర్, ఈలప్రోలు, గుంటుపల్లి, జూపూడి, కిలేశపురం, కేతనకొండ, మూలపాడు, కొటికలపూడి గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలోని పైడూరుపాడు, రాయనపాడు గ్రామాల ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
వాయు కాలుష్య కేంద్రంగా ఎన్టీటీపీఎస్ మంచులా కమ్మేస్తున్న బూడిద
ఆస్పత్రులపాలవుతున్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం, సమీప గ్రామాల ప్రజలు
బూడిద వ్యాపారులుగా మారిన ఉద్యోగులు
ఎన్టీటీపీఎస్ మాకొద్దని రోడ్డెక్కుతున్న స్థానికులు
దేశానికే వెలుగునిచ్చే కేంద్రంగా ఎన్టీటీపీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత వైసీపీ ఐదేళ్ల పాపాలు ఆ ప్లాంటు ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. నేతల ధనదాహం, అధికారుల అలసత్వంతో వెలుగునిచ్చే కేంద్రం కాస్త బూడిద కాలుష్యం వెదజల్లే కేంద్రంగా మారిపోయింది. వైసీపీ అతినీతిని తమకు అంటించుకొని సంస్థ ఉద్యోగులు సైతం బూడిద వ్యాపారులుగా తయారయ్యారు. ఫలితంగా ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద కాలుష్యంతో కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టు పక్కల ఉన్న శాంతినగర్, ఈలప్రోలు, గుంటుపల్లి, జూపూడి, కిలేశపురం, కేతనకొండ, మూలపాడు, కొటికలపూడి గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలోని పైడూరుపాడు, రాయనపాడు గ్రామాల ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఇబ్రహీంపట్నం-ఆంధ్రజ్యోతి : ఎన్టీటీపీఎస్‌లో 210 మెగా వాట్ల ఉత్పత్తి చేసే ఆరు యూనిట్ల నుంచి 1,260 మెగావాట్లు, 500 మెగా వాట్ల యూనిట్, 800 మెగా వాట్ల యూనిట్ నుంచి రోజుకు 2,560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకు రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు.. బొగ్గు వినియోగించిన అనంతరం వచ్చే బూడిదను బూడిద చెరువులోకి పంపగా సైలోస్ ద్వారా వచ్చే బూడిదను ప్లాంట్ నుంచి టిప్పర్లు, లారీల ద్వారా బయటకు పంపుతు న్నారు. అయితే 800 మెగావాట్ల యూనిట్‌కు సైలోస్ ఏర్పాటు చేయకుండానే విద్యుత్ ఉప్పత్తి చేస్తున్నారని, వచ్చే బూడిదను కింద పోసి లోడింగ్ చేసి లారీల ద్వారా తరలించడం వల్లే ప్లాంట్ ఏరియాతో పాటు చుట్టు పక్కల గ్రామాలపై పెద్ద ఎత్తున బూడిద మంచు వర్షం కురిసినట్లు కురుస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపుల ద్వారా పంపే బూడిద ప్లాంట్‌లో కొన్ని పరికరాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కూడా బూడిద పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తుందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా దగ్గరగా ఉన్న ఈలప్రోలు గ్రామస్థులైతే ఈబూడిద వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా తలుపులు వేసుకొని ఇళ్లలో ఉంటున్నామని వాపోతున్నారు. వారి కార్లను సైతం గొల్లపూడి తదితర ప్రాంతాల్లో బంధువుల అపార్ట్‌మెంట్లలో నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వంలో సీఎస్‌ఆర్ ఫండ్ నిల్
టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు సుమారు రూ.9 కోట్లు నిధులు విడుదల కాగా వాటితో కొండపల్లి, ఇబ్రహీంపట్నం, ఇతర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఇంకా రూ.21 కోట్లు రావాల్సి ఉంది. వాటి గురించి కాలుష్య నియంత్ర మండలి సభ్యులు పోరాడుతున్నారు.
ఎన్వీరాన్‌మెంట్ ఫండ్ ఏమైనట్లు?
పర్యావరణ పరిరక్షణకు కేటాయించిన ఫండ్ ఏమైనట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్వీరాల్‌మెంట్ ఫండ్ వందల కోట్లతో కాలుష్య బాధిత గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు, పశువులకు వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు సరఫరా చేయాల్సి ఉంది. ఇలా నెల నెలా జరగాల్సి ఉన్నా ఎక్కడా అలా పెట్టిన దాఖలు లేవు. మరి నిధులు ఏమైనట్లు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎక్కడా ఒక్క మొక్క పెట్టినట్లు గానీ, వాటికి ట్రీ గార్డులు పెట్టిన గానీ దాఖలు లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీనరీ కింద అడిగితే కొండపల్లి రిజర్వు ఫారెస్టును చూపించి చేతులు దులుపుకున్నారు.
శిథిలావస్థలో చిమ్నిలు
ఎప్పుడో నిర్మించిన 210 మెగా యూనిట్ల్‌లో ఉన్న పాత చిమ్నిలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని తొలగించాల్సి ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆ చిమ్నిల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వస్తుంది. తక్షణం వాటిని తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఎన్టీటీపీఎస్ నుంచి బూడిద మంచులా పడటం, రవాణా చేసే టిప్పర్ల నుంచి రోడ్డుపై గుట్టలు గుట్టలుగా పడటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కూడా ఇదే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. పొగ మంచులా బూడద కమ్మేయడంతో రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని కారు ఢీ కొని సత్యనారాయణపురానికి చెందిన తల్లీకూతుళ్లు కాసుల కవిత, హర్షిత మృతి చెందారు. బూడిద చెరువు నుంచి బూడిదను రవాణా చేసే టిప్పర్లకు ఉన్న రంధ్రాల నుంచి నీటితో పాటు బూడిద కారుతోంది. ఇలా కారిన బూడిద వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 100కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సుమారు 10 మందికి పైగా మరణించగా, పలువురు క్షతగాత్రులయ్యారు. రహదారులపై కారే బూడిదను ఎన్టీటీపీఎస్ అధికారులు శుభ్రం చేయాల్సి ఉండగా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.
పోరాటం ఫలించేనా!
మా ప్రాణాలు హరించే ఎన్టీటీపీఎస్ మాకొద్దు అంటూ వారం రోజుల కిందట కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు ఎన్టీటీపీఎస్ కొత్తగేటు ఎదుట సుమారు నాలుగు గంటల పాటు బైటాయించి నిరసన తెలిపారు. బూడిద చేతులతోనే అల్పాహారం తిని రోడ్డు ఊడ్చి ప్లాంట్లో పోసి పెద్ద పెట్టున ప్లాంట్ యాజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. చర్చలకు వచ్చిన ప్లాంట్ ఉన్నతాధికారి ముఖంపై బూడిద కొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఉద్యమం చేస్తున్నా ఎన్టీటీపీఎస్ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లు ఉండటం లేదు.
ఉద్యమంతోనే అడ్డుకోగలం
ప్రజా ఉద్యమాల ద్వారానే ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యాన్ని అడ్డుకోగలం. పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమానికి సహకరించాలి. ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్నాం. జాగ్రత్త పడకపోతే పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.
- అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యుడు