Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం..
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:22 AM
Fake Currency: ఏపీలోని రెండు జిల్లాల్లో దొంగ నోట్లు కలకలం రేగింది. మచిలీపట్నం నగరంలోని వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. అలాగే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో కూడా నకిలీ కరెన్సీ కలకలం రేగింది.
కృష్ణ జిల్లా: దేశంలో ఫేక్ నోట్లు (Fake Currency) ఎక్కువైపోతున్నాయి.. దీనిపై ఆర్‌బీఐ (RBI) ఆందోళన వ్యక్తం చేస్తోంది.‘ ధనం మూలం ఇదం జగత్’ అనే సామెత ఉంది కదా.. ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే ఈ డబ్బు పిచ్చితో, సులభంగా సంపాదించాలనే ఆలోచనతో, కొందరు మోసగాళ్లు (Fraudsters) వృద్ధులు (Elderly), చిరు వ్యాపారులను (Small business) లక్ష్యంగా (Target) చేసుకొని కలర్ జిరాక్స్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారు, భారీమొత్తంలో నగదు అవసరమున్నవారే మోసగాళ్ల లక్ష్యం. డబ్బు అవసరం ఉన్న వారిని ఎంచుకుని వల విసురుతారు. పెద్దమొత్తంలో నగదు వస్తుందంటూ ఆశ చూపుతారు. తొలుత కొంతమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ వారిని ఉచ్చులోకి లాగుతారు. ఆ తర్వాత కొంతమొత్తంలో నగదుతోపాటు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇలా ఒకేటేంటి రకరకాలుగా అవతలి వ్యక్తుల వద్ద ఉన్నవి ఊడ్చేస్తారు. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న నకిలీ నోట్ల చలామణి. కొన్నేళ్లుగా సద్దుమణిగిన ఈ వ్యాపారం మళ్లీ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని రెండు జిల్లాల్లో దొంగ నోట్లు కలకలం రేగింది.
మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం..
కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్‌లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపులో సిబ్బంది దొంగ నోటును గమనించలేదు. తర్వాత షాపు యజమాని గమనించి.. చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాగా 500 రూపాయల దొంగ నోట్ల మొత్తం విలువ రూ.12 వేలు.. దొంగ నోట్ల కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం
అలాగే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం రేగింది. టాయ్ క్యాష్‌తో దుండగులు మోసానికి యత్నించారు. రూ. 2.50 లక్షలకు రూ. 15 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదుర్చుకుని, డబ్బు చేతులు మారుతున్న సమయంలో నకిలీ కరెన్సీకి బదులు టాయ్ క్యాష్ ఇస్తున్నట్లుగా ఓ బాధితుడు గుర్తించాడు. పారిపోవడానికి యత్నించిన దుండగులలో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నకిలీ కరెన్సీపై అప్రమత్తం
నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే, నష్టపోయే ప్రమాదం ఉందని, సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈ విధంగా చేస్తుంటారని, అలాంటి వారి దారిలో ఎవరూ వెళ్లకూడదని పోలీసులు సూచించారు.