Share News

తొలి అడుగు

ABN , Publish Date - Mar 19 , 2024 | 01:04 AM

కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో రెండు వత్సరాల కిందట ఉదయించింది నవ ఎన్టీఆర్‌ జిల్లా. కృష్ణాజిల్లా నుంచి విడి.. అన్న నందమూరి తారక రామారావు పేరు మీదుగా వడివడిగా అడుగులు వేసిన ఈ కొత్తజిల్లా ఆశించిన మేర అభివృద్ధివైపు మాత్రం పరుగులిడలేదు. పునర్విభజన జరిగి రెండేళ్లు కూడా కాకముందే వస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికలు కొత్త జిల్లాకు కీలకమనే చెప్పాలి. ఎన్నో కలలకు ప్రధాన దారిగా, భవిష్యత్తు తరాలకు చుక్కానిగా నిలవనున్న ఎన్టీఆర్‌ జిల్లాకు ఈ ఎన్నికలు ఓ మైలురాయేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కదన రంగంలోకి అడుగు పెడుతున్న మన కొత్త జిల్లా భౌగోళిక స్వభావాలతో పాటు రాజకీయ ముఖచిత్రాన్ని ఒకసారి పరికిస్తే..

తొలి అడుగు

మారిన భౌగోళిక స్వరూపాలు.. ముఖచిత్రం

3,316 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం

ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం

16 మండల పరిషత్తులతో ఉమ్మడి కృష్ణాలోనే జడ్పీ పాలన

రెండు జిల్లాల్లో విస్తరించిన విజయవాడ రూరల్‌ మండలం

కొత్త జిల్లా ఏర్పడినా.. అభివృద్ధి మాత్రం శూన్యం

ఈ ఎన్నికలే కీలకమంటున్న విశ్లేషకులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 2022, ఏప్రిల్‌ 4న ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి విడివడిన తర్వాత ఎన్టీఆర్‌ జిల్లా భౌగోళిక స్వరూప స్వభావాలు, రాజకీయ ముఖచిత్రాలు మారాయి. తూర్పున ఏలూరు జిల్లా, పశ్చిమాన గుంటూరు జిల్లా, ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన కృష్ణాజిల్లా సరిహద్దుగా కలిగి ఉంది. 3,316 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 321 రెవెన్యూ గ్రామాలు, 288 పంచాయతీలు, 20 మండలాలు, మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. నందిగామ రెవెన్యూ డివిజన్‌లో 7 మండలాలు, తిరువూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 5 మండలాలు, విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉండగా, మునిసిపాలిటీలుగా కొండపల్లి, జగ్గయ్యపేట, తిరువూరు ఉన్నాయి.

మారిన రాజకీయ ముఖచిత్రం

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉన్నాయి. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ స్థానాలు కాగా, విజయవాడ పార్లమెంట్‌ స్థానంగా ఉంది. ఇక.. కృష్ణాజిల్లా పరిధిలో ఉన్న గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్‌ మండలానికి చెందిన 16 గ్రామాలు ఎన్టీఆర్‌ జిల్లాలోనే అంతర్భాగంగా ఉన్నాయి. ఈ 16లో ఏడు మైలవరం, తొమ్మిది గన్నవరం నియోజకవర్గాల్లోకి వస్తాయి. విజయవాడ రూరల్‌ మండలంలోని గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి, వైఎస్సార్‌ గ్రామ పంచాయతీ, రామరాజ్యనగర్‌, కొత్తూరు తాడేపల్లి గ్రామాలు మైలవరం నియోజకవర్గంలోకి, విజయవాడ రూరల్‌ మండలంలోని గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, పి.నైనవరం, అంబాపురం పంచాయితీలు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తాయి. రామరాజ్యనగర్‌, వైఎస్సార్‌ గ్రామం కిందటి పంచాయతీ ఎన్నికలకు ముందే ఏర్పడ్డాయి. అయితే, వీటికి ఎన్నికలు జరగలేదు. విజయవాడ రూరల్‌ మండలంలో అత్యధికంగా 1.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇది కృష్ణాజిల్లాలోని పెడన నియోజకవర్గం ఓటర్లతో సమానం. అందుకే విజయవాడ రూరల్‌ను ఎప్పటి నుంచో ప్రత్యేక నియోజకవర్గం చేయాలన్న డిమాండ్‌ వస్తోంది.

ప్రస్తుతం ఉమ్మడి జడ్పీనే..

జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకపోవటం, కేంద్ర గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాకపోవటం వల్ల రాజ్యాంగబద్ధమైన సంస్థలకు సంబంధించి విభజన పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. జడ్పీ కొలువుదీరిన తర్వాత కాలంలో ఎన్నికలు జరగటంతో ప్రస్తుతం ఉమ్మడి జడ్పీగానే కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో 16 మండల పరిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లా జడ్పీ పరిధిలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో వేర్వేరుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

జిల్లా జనాభా.. ఓటర్ల వివరాలు..

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 22.18 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో పురుషులు 11.14 లక్షల మంది, మహిళలు 11.04 లక్షల మంది. ప్రతి 1,000 మంది పురుషులకు 991 మంది మహిళల చొప్పున జిల్లాలో లింగ నిష్పత్తి ఉంది. 4.06 లక్షల మంది షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జనాభా, 82 వేల మంది షెడ్యూల్డ్‌ తెగల జనాభా నివసిస్తున్నారు. ఇటీవల కులగణన జరిగినప్పటికీ ఆ వివరాలను వెల్లడించలేదు. తుది ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే.. ఎన్టీఆర్‌ జిల్లాలో 16,74,995 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మహిళా ఓటర్లు 8,57,361 మంది ఉంటే, పురుష ఓటర్లు 8,17,484 మంది. థర్డ్‌జెండర్‌ ఓటర్లు 150 మంది, సర్వీసు ఓటర్లు 386 మంది ఉన్నారు. తిరువూరులో 2,54,476 మంది, విజయవాడ పశ్చిమలో 2,48,849 మంది, విజయవాడ సెంట్రల్‌లో 2,73,754 మంది, విజయవాడ తూర్పులో 2,64,778 మంది, మైలవరంలో 2,76,409 మంది, నందిగామలో 2,03,322 మంది, జగ్గయ్యపేటలో 2,02,407 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - Mar 19 , 2024 | 01:04 AM