Share News

నేటి నుంచి పతాక నాట్యోత్సవాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:33 AM

కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27 శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిదేంధ్రయోగి నాట్య కళావేదికపై కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు నాట్యక్షేత్రమైన కూచిపూడి ముస్తాబైంది.

నేటి నుంచి పతాక నాట్యోత్సవాలు

కూచిపూడి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27 శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిదేంధ్రయోగి నాట్య కళావేదికపై కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు నాట్యక్షేత్రమైన కూచిపూడి ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా ఉదయం ప్రసంగాలు, సాయంత్రం నాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ముగింపు రోజైన ఆదివారం రెండు వేలమంది కళాకారులతో బృంద నాట్యం కూచిపూడి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల కళాకారులు ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా 50 అడుగుల నాట్య పతాక స్థూపాన్ని ఏర్పాటు చేసినట్టు ఉత్సవ కమిటీ కన్వీనర్‌ వేదాంతం వెంకట నాగ చలపతి తెలిపారు.

నభూతో నభవిష్యత అనేలా కార్యక్రమాలు

- ఉత్సవ కమిటీ కన్వీనర్‌ వేదాంతం వెంకట నాగ చలపతి

నభూతో నభవిష్యత అనే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాచీన కూచిపూడి సాంప్రదాయ కళలను భావితరాలకు, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూచిపూడి ప్రాశ్యస్థ్యాన్ని ప్రపంచ నలుమూలల విస్తరించేందుకు అందరి సహకారంతో చేపట్టాం.

కూచిపూడి నాట్యం అజరామరం

- ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా

సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాచీన కూచిపూడి నాట్య కళ అజరామరం. మూడు రోజుల కూచిపూడి నాట్యోత్సవ వేడుకల విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. మంత్రులు కందుల దుర్గేష్‌, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొంటారు.

స్వర్ణోత్సవాలకు సర్వం సిద్ధం

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

కూచిపూడి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : నాట్యక్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాట్యోత్సవాల్లో దేశంలోని వివిధ రాషా్ట్రలకు చెందిన కళాకారులతోపాటు అమెరికా, రష్యా, కెనడా, జపాన్‌ దేశాలకు చెందిన కళాకారులు తమ నాట్య ప్రదర్శనల ద్వారా సిద్దేంధ్ర యోగికి నాట్య నీరాజనాలు అర్పించనున్నట్టు తెలిపారు. కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర క్రియేటివ్‌ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలను కార్మిక శాఖ, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి వాసంశెట్టి సుభా్‌షతోపాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, 7 గంటలకు నాట్య శిక్షణా శిబిరం, 9 గంటలకు నాట్య పతాక స్థూప ఆవిష్కరణ, 9.30 నుంచి రాత్రి 11 వరకు నాట్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ముగింపు రోజైన ఆదివారం 2 వేలమంది కళాకారులతో బృంద నాట్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. దేశ విదేశాల నుంచి తరలి వచ్చే కళాకారుల ప్రదర్శనలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 27 , 2024 | 01:33 AM